హైదరాబాద్, వెలుగు: చేవెళ్లలో పట్లోళ్ల కుటుంబానికి రాజకీయ సమాధి తప్పదని మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ఆరోపించారు. వార్డు మెంబర్ కూడా గెలవని కార్తీక్ రెడ్డి ఎంపీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని, బీజాపూర్ హైవే తెచ్చిందే ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి అని విమర్శించారు. గురువారం చేవెళ్లలో మీడియాతో మాట్లాడుతూ.. పట్లొళ్ల ప్యామిలీ ప్రాతినిధ్యం వహించిన చేవెళ్లలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లేవన్నారు.
ఈ ప్రాంతానికి నీళ్లిస్తామని వైఎస్సార్ హయాంలో తీసుకొచ్చిన ప్రాణహిత చేవెళ్ల ఏమైందని ప్రశ్నించారు. ఏమీ చేయకపోగా చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టులో మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట రూ. 800 కోట్లు దిగమింగారని ఆరోపించారు. పూడూరులో నేవీ రాడార్, హైదరాబాద్ -బీజాపూర్ జాతీయ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందే విశ్వేశ్వర్ రెడ్డి అని స్పష్టం చేశారు. సమావేశంలో బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు అత్తెళ్లి అనంత్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, డాక్టర్ మల్గారి వైభవ్ రెడ్డి, శంకర్, వెంకట్రామ్ రెడ్డి పాల్గొన్నారు.
