వీసీ పోస్టులకు మంత్రుల సిఫార్సు

వీసీ పోస్టులకు మంత్రుల సిఫార్సు
  • ఎంపీలు, ఎమ్మెల్యేలతోనూ చెప్పిచ్చుకుంటున్న ప్రొఫెసర్లు
  • పదవి కోసం కోట్లు ఖర్చు పెట్టేందుకూ రెడీ
  • ఓయూ, జేఎన్టీయూ, కేయూ, టీయూలకు ఫుల్ డిమాండ్
  • వారం లోపు వీసీ అప్లికేషన్ల స్క్రూటినీ పూర్తయ్యే చాన్స్

హైదరాబాద్, వెలుగురాష్ర్టంలోని యూనివర్సిటీల వైస్​చాన్స్ లర్ల (వీసీ) రిక్రూట్ మెంట్ లో పొలిటికల్ ఇన్వాల్వ్ మెంట్ పెరిగింది. వీసీ పోస్టులకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి పెద్ద ఎత్తున సిఫార్సులు వస్తున్నాయి. దీంతో సర్కార్ ఆఫీసర్లు అయోమయంలో ఉన్నారు. రెండు, మూడు వారాల్లో వీసీలను నియమించాలని సీఎం కేసీఆర్​ఫిబ్రవరిలో అధికారులను ఆదేశించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రిక్రూట్ మెంట్ ప్రాసెస్ ను పూర్తి చేయాలని నెల రోజుల కింద కూడా చెప్పారు. అయినప్పటికీ ప్రాసెస్​ మాత్రం ముందుకు సాగడం లేదు. దీనికి రాజకీయ ఒత్తిడే ప్రధాన కారణమని తెలుస్తోంది. స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ పరిధిలోని 11 యూనివర్సిటీల్లోనూ ఇన్ చార్జి వీసీలే ఉన్నారు. వీటిలో ఆర్జీయూకేటీ (బాసర ట్రిపుల్ ఐటీ), జేఎన్ఏఎఫ్ వర్సిటీలకు మినహా మిగతా 9 యూనివర్సిటీల వీసీ పోస్టులకు 273 మంది ప్రొఫెసర్లు 1,100 లకు పైగా అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఆ 9 వర్సిటీలకు సెర్చ్ కమిటీలు వేసినా, ఇప్పటి వరకు సమావేశం కాలేదు. అప్లికేషన్ల స్ర్కూటినీ కూడా ఇటీవలే ప్రారంభమైంది. ఈ ప్రాసెస్ వారం లోపు ముగియనుంది. ఆ వివరాలను అధికారులు ప్రభుత్వానికి పంపించనున్నారు. ఇక జేఎన్‌‌ఏఎఫ్‌‌యూకు దాదాపు 15 అప్లికేషన్లు రాగా, ఆర్జీయూకేటీకి ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు.

ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ…

దాదాపు 200 మంది వీసీ పోస్టుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఓయూ, జేఎన్టీయూ, కాకతీయ, తెలంగాణ యూనివర్సిటీల కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. ఇంతకుముందు వీసీలుగా పని చేసిన ముగ్గురు మరోసారి ఆ పదవి ఆశిస్తున్నారు. ముగ్గురు ప్రస్తుత రిజిస్ట్రార్లు, మరో ముగ్గురు మాజీ రిజిస్ట్రార్లు ఈసారి ఎలాగైనా వీసీ పోస్టు దక్కించుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ మంత్రితో పాటు సీఎంతో సన్నిహితంగా ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తరచూ కలుస్తున్నారు. వారి ద్వారా సిఫార్సు చేయించుకుంటున్నారు. ముగ్గురు మైనార్టీ సీనియర్ ప్రొఫెసర్లు ఎంఐఎం నేతలతోనూ చెప్పిస్తున్నారు. ఉత్తర తెలంగాణలోని ఇద్దరు మాజీ ఎంపీలనూ పలువురు ప్రొఫెసర్లు కలిసి, వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. యూనివర్సిటీ ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లా మంత్రులనూ కలిసి బయోడేటాలు అందిస్తున్నారు. సొంత జిల్లాల వారీగా, కులాల వారీగా ఆశావాహులు… మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తున్నారు. గతంలో ఓ మాజీ ఎంపీ విదేశాలకు వెళ్తే, అక్కడా కొందరు కలిసినట్టు తెలిసింది. వీసీ పోస్టు కోసం కొందరు ప్రొఫెసర్లు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఖర్చు పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని సమాచారం. అయితే ఓయూ, జేఎన్టీయూ మినహా మిగిలిన అన్ని వర్సిటీలకు వీసీలను సర్కారు అనధికారికంగా ఖరారు చేసినట్టు తెలిసింది.

లొల్లి తట్టుకోలేక ప్రాసెస్ పక్కన పెట్టిన్రు..

వీసీల రిక్రూట్ మెంట్ బాధ్యతలను సీఎం కేసీఆర్ సీఎస్ కు అప్పగించారు. దీంతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఆయనకు సిఫార్సులు పంపిస్తున్నారని తెలిసింది. ఈ లొల్లి తట్టుకోలేక రిక్రూట్ మెంట్ ప్రాసెస్ ను కొన్ని రోజులు పక్కన పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ర్టంలో రిజిస్ర్టేషన్లు బంద్ అయ్యాయి. దీంతో సర్కార్​కు వచ్చే ఆదాయం ఆగిపోయింది. మరోపక్క ప్రభుత్వం ఫోకస్ అంతా ధరణి వెబ్ సైట్​మీదనే ఉంది. ఈ రెండూ పూర్తయ్యాకే వీసీల రిక్రూట్ మెంట్ పై దృష్టిపెట్టే అవకాశం ఉంది.