లోకల్ ఫైట్ పై పార్టీల ఫోకస్!.. బీసీ రిజర్వేషన్లు, హామీల అమలు, అభివృద్ధి ఎజెండాతో కాంగ్రెస్

లోకల్ ఫైట్ పై  పార్టీల ఫోకస్!.. బీసీ రిజర్వేషన్లు, హామీల అమలు, అభివృద్ధి ఎజెండాతో కాంగ్రెస్
  •     కాంగ్రెస్​ బాకీ కార్డుల పేరుతో జనంలోకి బీఆర్​ఎస్​  
  •     రెండు పార్టీల తీరును ఎండగడుతూ బీజేపీ
  •     బలమున్న చోట బరిలోకి కమ్యూనిస్టులు 
  •     క్యాడర్​ను సమాయత్తం చేస్తున్న లీడర్లు

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో పల్లెలకు ముందుగానే దసరా పండుగొచ్చింది. గ్రామాల్లో పొలిటికల్ హీట్ పెరిగిపోవడంతో అన్ని పార్టీలు స్థానిక ఎన్నికల బరిలో నిలిచేందుకు సమాయత్తమవుతున్నాయి. కార్యక్షేత్రంలోకి దిగేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. 

వార్డు సభ్యుడి నుంచి మొదలుకొని జడ్పీ పీఠం వరకు మెజార్టీ స్థానాల్లో పాగా వేసేందుకు పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నాయి.  ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డుమెంబర్ల ఎన్నికలు ఐదు విడుతల్లో జరగనుండగా.. ఆశావహులు సైతం సిద్ధమవుతున్నారు. ఇటు రాజకీయ పార్టీలు, పోటీదారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. ఇంటింటికెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. 

బీసీ రిజర్వేషన్లే కాంగ్రెస్ ఎజెండా..

రిజర్వేషన్లు, అభివృద్ధి ఎజెండాతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. బీసీలకు సామాజిక న్యాయం, అభివృద్ధి హామీల అమలును ప్రధాన ఆయుధాలుగా చేసుకుంది. 2023 కామారెడ్డి బీసీ డిక్లరేషన్' హామీ మేరకు.. 2025 మార్చిలో అసెంబ్లీలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ బిల్లులు పాస్ చేసి.. కేంద్రానికి పంపింది. ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ.. జీవో జారీ చేసింది. కాంగ్రెస్ బీసీల పక్షపాతి అనే సంకేతాన్ని పంపింది. 

మరోవైపు ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్లు, రుణమాఫీ, రైతు భరోసా. ఆర్టీసీ బస్సుల్లో మహిళ ఫ్రీ జర్నీ, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, ఆర్టీసీ బస్సులు, సోలార్ ప్లాంట్లు, పెట్రోల్బంకులు, గోదాముల నిర్వహణ అప్పగించడం లాంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు చేసిన మోసాన్ని.. బీసీ బిల్లులను పెండింగ్ పెట్టిన బీజేపీ వైఖరిని ఎండగట్టాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్​ బీసీ రిజర్వేషన్లు, ఇచ్చిన హామీల అమలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్రధాన ఎజెండాగా  ముందుకెళ్లనుండగా..  బీఆర్​ఎస్​ మాత్రం కాంగ్రెస్​అమలుచేయని హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ‘స్థానిక’ పోరులో సత్తాచాటాలని భావిస్తోంది. కాగా, ఇప్పటికే ఈ  రెండు పార్టీలకు ఓటు వేసి మోసపోయినందున జనం తమవైపే మొగ్గుచూపుతారని బీజేపీ చెబుతోంది. 

 కమ్యూనిస్టులు మాత్రం​ప్రజా సమస్యలను లేవనెత్తి వారి మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తమకు బలమున్న చోట సొంతంగానే బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం కలుస్తాయా? కాంగ్రెస్​తో కలిసి పోటీచేస్తాయా? వేర్వేరుగా బరిలో నిలుస్తాయా అనేది ఆసక్తిగా మారింది. 

కాంగ్రెస్​ ఆరు గ్యారంటీలపై నిలదీయాలని  కేడర్​కు బీఆర్​ఎస్ పిలుపు​

ఎన్నికల ముందు కాంగ్రెస్​ పార్టీ 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని బీఆర్​ఎస్​ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ ను​నిలదీయాలని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతో పాటు ఇటీవల తలెత్తిన యూరియా కొరతతో రైతులు పడిన గోసను ఇంటింటికి తీసుకెళ్లేందుకు సోషల్​ మీడియాను విస్తృతంగా వాడుకోవాలని భావిస్తోంది. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ అధికార పార్టీకి కౌంటర్ గా కాంగ్రెస్ బాకీ కార్డుల పేరుతో ప్రచారానికి తెరలేపింది. గ్రామాలకు వెళ్లి  కాంగ్రెస్ బాకీ కార్డును అందించేలా ప్లాన్​ చేస్తోంది. 

పల్లెల్లో పాగా వేసేందుకు బీజేపీ ప్లాన్..  

పట్టణ ప్రాంతానికే పరిమితమైన బీజేపీ.. పల్లెల్లోనూ పాగా వేసేందుకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లను వాడుకునేందుకు ప్లాన్​చేస్తోంది. రాష్ట్రంలో బీజేపీ 8 ఎమ్మెల్యే సీట్లను, 8 ఎంపీ సీట్లను గెలుచుకొని సత్తా చాటింది.  అదే విజయోత్సాహాన్ని పల్లెపోరులోనూ ప్రదర్శించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా  ఇప్పటికే బూత్ లెవల్​ నుంచి రాష్ట్ర స్థాయి వరకు వర్క్ షాపులను సైతం నిర్వహించింది. 

హామీల అమలులో జాప్యంపై కాంగ్రెస్​ సర్కార్​ను కార్నర్​ చేస్తోంది. అదే సమయంలో బీఆర్​ఎస్​ పదేండ్లు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని.. వారి అవినీతి, అక్రమాలను ఎండగట్టేందుకు రెడీ అవుతోంది. మరోవైపు బీజేపీ స్టేట్​ చీఫ్​గా రాంచందర్​రావు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ప్రధానంగా పార్టీ బలోపేతంపై ఫోకస్​ పెట్టారు.  స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకోవడం ద్వారా తనకు ఎదురవుతున్న మొదటి పరీక్షలో విజయవంతం కావాలని భావిస్తున్నారు. 

బలమున్నచోటే కమ్యూనిస్టుల పోటీ..

రాష్ట్రంలో కమ్యూనిస్టులు తమకు బలమున్న చోట్ల బరిలో దిగాలని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​, సీపీఐ కలిసి పోటీ చేశాయి.  స్థానిక ఎన్నికల్లో పొత్తులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో తమకు బలమున్నచోట పోటీచేస్తామని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.  ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్​తో సీపీఐ కలిసి ముందుకువెళ్తుంటే.. సీపీఎం మాత్రం రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నది.