తెలంగాణలో ముగిసిన పోలింగ్ ఈసారి ఎంతశాతం నమోదైందంటే..?

తెలంగాణలో ముగిసిన పోలింగ్ ఈసారి ఎంతశాతం నమోదైందంటే..?

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 114 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తైంది. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 63.94 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మెదక్‌ జిల్లాలో అత్యధికంగా 80.28శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 39.97 శాతం పోలింగ్‌ నమోదైంది. మరోవైపు ఎన్నికల పోలింగ్‌ సమయంలోపు క్యూలైన్‌లో నిలబడిన వారిని ఓటు వేసేందుకు అనుమతించారు. 

సాయంత్రం 4 గంటల వరకు మాత్రం తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ కొనసాగింది. సమస్యాత్మకమైన ప్రాంతాల్లో పోలింగ్ సమయాన్ని కుదించారు. సిర్పూర్‌, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగతా జిల్లాల్లో మాత్రం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. కొన్ని చోట్ల మాత్రం క్యూలైన్లలో ఓటర్లు ఉండడంతో వారికి అవకాశం ఇచ్చారు. ఓటు వేసే చాన్స్ ఇస్తున్నారు అధికారులు. 

డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు

తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ గురువారంతో ముగిసింది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబరు 3వ తేదీన ప్రకటించనున్నారు. మరోవైపు గురువారం సాయంత్రం 5.30 నిమిషాల తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది.