పీసీఓఎస్​ అనేది దీర్ఘకాలిక సమస్య

పీసీఓఎస్​ అనేది దీర్ఘకాలిక సమస్య

పదహారేండ్ల కావ్య వయసుకు మించి బరువు ఉంది. అది చాలదన్నట్టు మూతి మీద  వెంట్రుకలు పెరిగి మీసాల్లా కనిపించేవి. లావుగా ఉండడం, మూతిమీద ఉన్న అవాంఛిత రోమాలను చూసి ఎగతాళిగా మాట్లాడేవాళ్లు చాలామంది. ఆ మాటలను అంతగా పట్టించుకునేది కాదు. చదువు పూర్తై, ఉద్యోగంలో చేరాక కావ్యకు పెండ్లి అయింది. మూడేండ్లు గడిచినా పిల్లలు పుట్టలేదు. దాంతో హాస్పిటల్​కి వెళ్లింది. పీసీఓఎస్​ సమస్య వల్ల పిల్లలు కలగట్లేదని చెప్పారు డాక్టర్లు. వెంటనే కావ్య బుర్రలో ఎన్నో ప్రశ్నలు. కావ్య లాగానే చాలామంది ఆడవాళ్లకి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. కానీ... చాలామంది వాటి గురించి మాట్లాడే ప్రయత్నం చేయరు. అలాకాకుండా మొదట్లోనే తెలుసుకుంటే పీసీఓఎస్​ సమస్యకు చెక్​ పెట్టొచ్చు. పీసీఓఎస్​ అనేది దీర్ఘకాలిక సమస్య. ఆడవాళ్లలో ప్రతి ఒక్కరికీ దీని గురించి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో సెప్టెంబర్​ నెలని ‘పీసీఓఎస్​ అవేర్​నెస్​ మంత్’​గా చేస్తున్నారు. ‘ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే నయమయ్యే జబ్బు కాదు పీసీఓఎస్. ఇది ఒక సిండ్రోమ్. జీవితకాలం వెంటాడుతుంది. అలాగని భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ సమస్యను కంట్రోల్​ చేయడానికి మార్గాలున్నాయి’ అంటున్నారు డాక్టర్లు. 

పీసీఓఎస్​ అంటే.. 

పీసీఓఎస్ అంటే.. పాలీసిస్టిక్ ఓవెరీ  సిండ్రోమ్​. అండం చుట్టూ సిస్ట్​(బుడగ)లు ఏర్పడటాన్నే పీసీఓఎస్​ అంటారు. ఇవి రెండు వైపులా10 నుంచి12 చొప్పున ఉంటాయి. సైజు 2 నుంచి 9 మిల్లీమీటర్ల లోపు ఉంటుంది. ఒకప్పుడు ఈ కండిషన్​ని ‘జబ్బు’ అని చెప్పేవాళ్లు. దాన్నే.. ఇప్పుడు ‘సిండ్రోమ్’ అని పిలుస్తున్నారు. దీనివల్ల సహజంగా నెలకు ఒకసారి రావాల్సిన పీరియడ్స్.. రెండు మూడు నెలలకో లేదా ఏడాదిలో 3, 4 సార్లు మాత్రమే వస్తాయి. అలా రావడాన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారు. పీరియడ్స్ సైకిల్ సరిగా లేకపోతే ప్రెగ్నెన్సీ రావడం కష్టం. ప్రెగ్నెన్సీ వచ్చినా మిస్​ క్యారేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

హార్మోన్లే కీలకం

ఇది జెనెటిక్ సమస్య. ఫ్యామిలీలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే అది పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. దీనికి ముఖ్యకారణం హార్మోనల్ ఇంబాలెన్స్. శారీరక, మానసిక ఎదుగుదలకు హార్మోన్లే కీలకం. అయితే, మగవాళ్లలో ఉండే టెస్టోస్టిరాన్ హార్మోన్లు పీసీఓఎస్​ ఉన్న ఆడవాళ్లలో ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఇన్సులిన్ సరిగా పనిచేయదు. ఇన్సులిన్ పనిచేయకపోతే టెస్టోస్టిరాన్ హార్మోన్లు ఇంకా పెరిగిపోతాయి. ఇది ఒక సైకిల్​లా జరుగుతుంటుంది. ఇలా జరిగేటప్పుడు అండాలు పరిపక్వత చెందవు. విడుదల కాకుండా అక్కడే గుడ్లుగా మిగిలిపోతాయి. అల్ట్రాసౌండ్ టెస్ట్ చేసినప్పుడు అవే సిస్ట్​ల్లా కనిపిస్తాయి. 

గుర్తించడమెలా?

ఈ సమస్య తల్లికి ఉంటే పిల్లలకు వస్తుందని ముందే తెలుసుకోవచ్చు. అలాగే డయాబెటిస్ ఉన్నవాళ్ల పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. పీసీఓఎస్​ ఉన్నవాళ్లు లావు అవుతారు. వయసు కంటే ముందే మెచ్యూర్ అయిన ఆడపిల్లల్లో, మెచ్యూర్​ అయినా రెండు మూడేండ్ల వరకు పీరియడ్స్ రానివాళ్లలో ఈ సమస్య కనిపిస్తుంది. కానీ.. పద్దెనిమిదేండ్లు నిండే వరకు వాళ్లకు పీసీఓఎస్​ ఉందని చెప్పలేం. ఎందుకంటే పెరిగే వయసు కాబట్టి పీరియడ్స్ రాకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. సహజంగా అమ్మాయిలు ఎదిగేటప్పుడు టెస్టోస్టిరాన్ హార్మోన్లు పెరుగుతాయి. ఎందుకంటే ఇది పెరుగుదలకు తోడ్పడే హార్మోన్.​ కాబట్టి ఎదిగే దశలో మామూలుగానే పీరియడ్స్ సరిగా రావు. ఈ సమస్య ఉన్న వాళ్లలో 75శాతం మంది బరువు ఎక్కువ​ ఉంటారు. 25 శాతం మాత్రమే మామూలు బరువు ఉంటారు. అంటే... ఎక్కువ బరువు ఉన్నవాళ్లలో ఈ సమస్య కనిపిస్తుంది. 

కంట్రోల్​ చేయొచ్చు 

పీరియడ్స్ రావాలంటే బ్రెయిన్​లో ఉండే హైపోతలామస్ నుంచి పిట్యూటరీ గ్లాండ్​కి సిగ్నల్స్ రావాలి. అక్కడి నుంచి ఓవరీకి సిగ్నల్స్ వెళ్లాలి. అప్పుడు పీరియడ్స్ రెగ్యులర్​గా  వస్తాయి. ఇన్సులిన్ తక్కువ పనిచేస్తే ఎదుగుదల బాగుంటుంది. ఈ రోజుల్లో పిల్లలకు స్ట్రెస్ ఎక్కువైపోతోంది. పెరిగే వయసు కాబట్టి ఆకలికి ఆగలేక నచ్చింది తినేస్తున్నారు. ఇంట్లో, స్కూల్​ లేదా కాలేజీల్లో శారీరక శ్రమ ఉండట్లేదు. దాంతో బరువు పెరుగుతున్నారు. బరువు తగ్గితే ఇన్సులిన్ సరిగా పనిచేస్తుంది. అప్పుడు మేల్ హార్మోన్లు తగ్గుతాయి. అవాంఛిత రోమాలు రావు. అండం సాఫీగా విడుదలవుతుంది. కానీ, ఇది లైఫ్​లాంగ్​ ప్రాసెస్. అందుకని బరువు పెరిగితే ఈ పరిస్థితి మళ్లీ వస్తుంది. 

తగ్గించుకోవచ్చు

రెగ్యులర్​గా పీరియడ్స్ రావడానికి హార్మోన్​ థెరపీ చేయించుకోవాలి. కొన్నిసార్లు, కొందరిలో డయాబెటిస్ త్వరగా వస్తుంది. అలాంటప్పుడు షుగర్ ట్యాబ్లెట్స్ కూడా వాడాలి.  డైట్, ఎక్సర్​సైజ్ రెగ్యులర్​గా ఫాలో కావాలి. ఇవన్నీ పాటిస్తేనే ఆరోగ్యంగా ఉంటారు. పీసీఓఎస్​ని కంట్రోల్ చేయగలుగుతారు.

సమస్యలు ఇవే...

పై పెదవి పైన, గడ్డం కింద, పొత్తికడుపు, తొడల మీద వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతాయి. అలాగే మెడ మీద నల్ల మచ్చలు ఏర్పడతాయి. ఊబకాయం, ఆందోళన, ఒత్తిడి, మొటిమలు ఎక్కువగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పీసీఓఎస్ సమస్య ఉన్న ఆడవాళ్లలో 50 శాతం మందికి డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది.  వీళ్లలో మెనోపాజ్ ఆలస్యంగా వస్తుంది. పోస్ట్ మెనోపాజ్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. అంటే.. పీరియడ్స్ ఆగిపోయాక వచ్చే సమస్యలన్నమాట. అవేంటంటే.. డయాబెటిస్, హైపర్​ టెన్షన్, హై కొలెస్ట్రాల్​, గుండె సంబంధిత వ్యాధుల వంటి బారిన పడే ప్రమాదం ఉంది. ఇవేకాకుండా గర్భాశయంలో క్యాన్సర్, ఒబెసిటీ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు మగవాళ్లలోనూ ఈ సమస్య కనిపిస్తుంది. కాకపోతే.. వాళ్లలో బట్టతల త్వరగా రావడం, లావెక్కడం, డయాబెటిస్ రావడం వంటివి ఉంటాయి.