- అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు : వరంగల్ నగర అభివృద్ధికి తక్షణమే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సెక్రటేరియెట్లో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో వరంగల్ నగర అభివృద్ధిపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ సిటీ తర్వాత వరంగల్ నగరాన్ని విస్తృత పరచడానికి
పలు అభివృద్ధి పనులు చేపట్టడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు గతంలోనూ సమావేశాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. గతంలో ఉన్న 2041 మాస్టర్ ప్లాన్ ను 2050 నాటి జనాభాను దృష్టిలో ఉంచుకొని నగరంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆయన అధికారులకు సూచించారు. ఇందుకు అవసరమైన భూ సేకరణ చేపట్టాలన్నారు.
ఇప్పటి వరకు కన్సల్టెంట్లు తయారు చేసిన మాస్టర్ ప్లాన్లను మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్పరిపాలన ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, రోడ్లు భవనాలు శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, కుడా వైస్ చైర్మన్, కమిషనర్ అశ్విని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.