పేదల సొంతింటి కల సాకారం చేస్తున్నం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి

పేదల సొంతింటి కల సాకారం చేస్తున్నం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి
  • పేదలందరికీ ఇండ్లు అందే వరకు  మంజూరు చేస్తూనే ఉంటాం
  • జూన్‌‌‌‌‌‌‌‌ 2న ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో సీఎం చేతుల మీదుగా రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు

ఆసిఫాబాద్/కాగజ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు : ‘పదేండ్ల బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పాలనలో ఫొటోలకే పరిమితం అయిన సొంతింటి కలను ఇందిరమ్మ పాలనలో సాకారం చేస్తున్నాం, పేదల కలను పూర్తి చేసేవరకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తూనే ఉంటాం’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరును జూన్‌‌‌‌‌‌‌‌ 2న సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ప్రారంభిస్తారని ప్రకటించారు. 

మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి బుధవారం కెరమెరి మండలం కొఠారి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. అనంతరం కాగజ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో హెలిప్యాడ్, సీఎం సభాస్థలి కోసం స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీఎం గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో పొంగులేటి మీడియాతో మాట్లాడారు. జూన్‌‌‌‌‌‌‌‌ 2న కొఠారి గ్రామంలోని 30 ఆదివాసీ గిరిజన లబ్ధిదారులు కట్టుకున్న ఇండ్లను ప్రారంభించిన అనంతరం కాగజ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌ రోడ్డులో జరిగే సభకు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి హాజరై, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేస్తారని చెప్పారు. 

మొదటి విడత కింద నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేశామని, ఇందులో ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ నాటికి 1.25 లక్షల ఇండ్లు పూర్తికాగా, జూన్‌‌‌‌‌‌‌‌ నాటికి 2  లక్షల ఇండ్లు పూర్తవుతాయన్నారు. రూ. 5 లక్షల బిల్లు చెల్లింపు పారదర్శకంగా జరుగుతోందన్నారు. సీఎం పర్యటనను సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌‌‌‌‌‌‌‌ కార్డులు పంపిణీ చేశారు. 

మంత్రుల వెంట ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్సీ దండే విఠల్, బెల్లంపల్లి, మంచిర్యాల ఎమ్మెల్యేలు వినోద్‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి, ప్రేమ్‌‌‌‌‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌రావు, హౌసింగ్‌‌‌‌‌‌‌‌ ఎండీ పీవీ.గౌతమ్‌‌‌‌‌‌‌‌, ఆసిఫాబాద్, మంచిర్యాల కలెక్టర్లు కె. హరిత, కుమార్‌‌‌‌‌‌‌‌దీపక్‌‌‌‌‌‌‌‌, అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ యువరాజ్‌‌‌‌‌‌‌‌ మర్మాట్‌‌‌‌‌‌‌‌ డేవిడ్‌‌‌‌‌‌‌‌, ఉట్నూర్ ఐటీడీఏ పీవో మంద మకరందు, డీసీసీ అధ్యక్షరాలు సుగుణ పాల్గొన్నారు.