ప్రాజెక్టుల రీ డిజైన్​ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం: పొంగులేటి

ప్రాజెక్టుల రీ డిజైన్​ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం: పొంగులేటి
  • గత బీఆర్ఎస్​సర్కారుపై మంత్రి పొంగులేటి ఆగ్రహం
  • సీతారామ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.2,400 కోట్ల నుంచి రూ.18 వేల కోట్లకు పెంచారని ఫైర్

ఖమ్మం, వెలుగు: ప్రాజెక్టుల రీ డిజైన్​ పేరుతో గత బీఆర్ఎస్​ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. జలయజ్ఞంలో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2,400 కోట్లతో 3.75 లక్షల ఎకరాల ఆయకట్టు కోసం రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్​ ప్రభుత్వం దానిని రీ డిజైన్ పేరుతో సీతారామ ప్రాజెక్టుగా పేరు మార్చి.. 2.75 లక్షల ఆయకట్టు చూపెట్టి రూ.18 వేల కోట్ల అంచనా ఖర్చు పెంచిందని తెలిపారు. అప్పటికే ప్రాజెక్టు కోసం వైఎస్​ ప్రభుత్వం వెయ్యి కోట్లకు పైగా ఖర్చుపెట్టిన తర్వాత, గత ప్రభుత్వం రీ డిజైన్ చేసి రూ.8 వేల కోట్లు ఖర్చుపెట్టిందని.. పనులు సవ్యంగా చేపట్టక, ప్రజల సొమ్మును వృథా చేసిందని పొంగులేటి అన్నారు.  శుక్రవారం ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో జరుగుతున్న సీతారామ ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ..  గత ప్రభుత్వ తప్పిదాలు సరిదిద్ది, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు, రైతులకు ప్రయోజనం చేకూరేలా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ఇందులో భాగంగా సుమారు 8.7 కి.మీ.ల లింక్ కెనాల్, 16 వేల క్యూసెక్కుల డిశ్చార్జ్ తో ఎన్ఎస్పీ పాత ఆయకట్టు 1.35 లక్షల ఎకరాలతోపాటు, వైరా, లంకాసాగర్ మీడియం ప్రాజెక్టులు, 15 మండలాల్లో ఉన్న మైనర్ ఇర్రిగేషన్ ట్యాంక్ ల స్థిరీకరణ కు లింక్ కెనాల్ నిర్మాణం చేపట్టామన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో పనులు పూర్తి చేసి ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకుంటామని తెలిపారు. గ్యాస్ లైన్ షిఫ్టింగ్, మరికొన్ని అడ్డంకులను అధిగమించి, మొదటి విడతగా గోదావరి నీటిని ఎన్ఎస్పీ ఆయకట్టుకు  అందించడానికి వేగంగా చర్యలు చేపడుతున్నామన్నారు. 

త్వరలోనే 2 లక్షల వరకు రుణమాఫీ

తమ ప్రభుత్వం రైతుపక్షపాతి అని మంత్రి పొంగులేటి అన్నారు. ఇప్పటికే  లక్షన్నర రూపాయల వరకు రైతు రుణమాఫీ చేశామని, రాబోయే రోజుల్లో రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. కొద్దిరోజుల్లోనే ఇండ్ల నిర్మాణాలను ప్రారంభిస్తామని చెప్పారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లని కూడా పూర్తిచేసి అర్హులకు అందజేస్తామన్నారు. తమ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డ్, ఆరోగ్యశ్రీ కార్డ్ విడివిడిగా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. త్వరలో అర్హులకు రేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు. ధరణితో ఇబ్బందులు పడుతున్న రైతులకు మోక్షం కల్పిస్తామని చెప్పారు. ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తామని, ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వ భూమికి కాపలాగా ఉంటామన్నారు. కార్యక్రమంలో నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్, కల్లూరు ఆర్డీవో రాజేందర్ పాల్గొన్నారు.