
- నిజాంపై ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం: పొంగులేటి సుధాకర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, జర్నలిస్ట్ షోయబుల్లాఖాన్ తన రచనలు, మాటల ద్వారా నిజాం అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడారని, ఆయన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకం అని తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల బీజేపీ నేషనల్ కోఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణ విమోచన ఉత్సవాల్లో భాగంగా శనివారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామంలో షోయబుల్లాఖాన్ కు సుధాకర్ రెడ్డి నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. షోయబుల్లాఖాన్, ఇతర స్వాతంత్ర్య పోరాట యోధుల స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు ధరావత్ హేమ్లా, బానోత్ అచ్చమ్మతో సుధాకర్ రెడ్డి మాట్లాడారు. యూరియా కొరత గురించి రైతులు ప్రస్తావించగా.. కేంద్రంలోని ప్రధాని మోదీ సర్కారు రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని చెప్పారు. రైతుల కోసం పీఎం కిసాన్, సబ్సిడీ యూరియా అందిస్తోందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ విమోచన వేడుకల కన్వీనర్ గోలి మధుసూదన రెడ్డి, బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, నాయకులు నున్నా రవికుమార్, దొంగల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.