
- డబ్బులు, భూములు, విల్లాలు, బంగారం ఇచ్చినోళ్లకే టికెట్లు ఇస్తున్నరు
- పార్టీతో సంబంధం లేని వ్యక్తికి పగ్గాలిస్తే ఇట్లనే ఉంటది
- బీసీ లీడర్లను హైకమాండ్ తీవ్రంగా అవమానించింది
- అపాయింట్మెంట్ కోసం 10 రోజులు తిరిగినా టైమ్ ఇయ్యలే
- దొంగ సర్వేలతో బీసీలకు టికెట్లు ఎగ్గొట్టేందుకు కుట్ర
- బీసీలకు బీఆర్ఎస్ పదవులిస్తుంటే కాంగ్రెస్ అవమానిస్తున్నదని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు. 45 ఏండ్లపాటు పార్టీలో కొనసాగిన ఆయన.. పార్టీ హైకమాండ్, పీసీసీ చీఫ్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ శుక్రవారం పార్టీ నుంచి వైదొలిగారు. పార్టీని ఓ వ్యాపార సంస్థగా మార్చేశారని మండిపడ్డారు. అంగట్లో గొడ్లను అమ్మినట్టు టికెట్లను అమ్ముకుంటున్నారని పేర్కొంటూ తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. ఆ తర్వాత తన ఇంట్లోనే మీడియాతో మాట్లాడారు. పార్టీలో రెండేండ్లుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం వ్యక్తిస్వామ్యం నడుస్తున్నదన్నారు. పార్టీలో ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న తన లాంటి సీనియర్లను పదేపదే అవమానిస్తున్నారని తెలిపారు.
అదే సమయంలో కొత్తగా వస్తున్న నేతలకే పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో పార్టీలోని సీనియర్ నేతలే పరాయివాళ్లలాగా ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని, తన లాంటి వాళ్ల ఉనికే ప్రమాదంలో పడిందని అన్నారు. ఇలాంటి విషయాలపై పీసీసీ చీఫ్‌తో మాట్లాడేందుకు ఎన్నో సార్లు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్‌తో సంబంధం లేని వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే.. పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అధికారంలోకి వస్తున్నామని చెప్తూ.. పార్టీ మొత్తాన్ని ఓ వ్యాపార సంస్థగా మార్చేశారని ఆరోపించారు. ఇలాంటి వ్యాపార రాజకీయాలతో రాష్ట్రంలో పార్టీ పరువు పోయిందన్నారు.
సామాజిక న్యాయానికి పాతర
పార్టీలో సామాజిక న్యాయానికి పాతరేశారని పొన్నాల మండిపడ్డారు. జనాభాలో 50 శాతానికిపైగా ఉన్న బీసీల పట్ల అత్యంత అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. జనాభా ప్రకారం సీట్లివ్వాలని అడిగితే.. కనీసం దానిపై చర్చించిన దాఖలాలు లేవన్నారు. బీసీలకు సీట్లను ఎగ్గొట్టేందుకే దొంగ సర్వేలు చేయిస్తున్నారని, బీసీలు ఓడిపోతారంటూ చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో లేని వ్యక్తులు గెలుస్తారంటూ సర్వే రిజల్ట్స్ తెప్పించుకుంటున్నారని, వారికే టికెట్లు ఇస్తామంటూ ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎవరో డబ్బులు ఇచ్చారన్న కారణంతో బీసీలు పనికిరారు.. ఓడిపోతారన్న ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. డబ్బులు, భూములు, విల్లాలు, బంగారం వంటివి ఇచ్చిన వారికి టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు.
ఒక్క నిమిషమైనా కేటాయించలే
పార్టీ అంశాలను చర్చించేందుకు తన లాంటి సీనియర్ నాయకుడు ఢిల్లీ వెళ్లి అపాయింట్మెంట్ అడిగితే.. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని పొన్నాల ఆరోపించారు. 10 రోజులు తిరిగినా ఒక్క నిమిషం కూడా సమయం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు న్యాయంగా సీట్లివ్వాలని అడిగేందుకు 50 మంది నేతలం ఢిల్లీ వెళ్తే ఏఐసీసీ నాయకులు కలవడానికి కూడా టైం ఇవ్వకుండా బీసీ నేతలను అవమానించారన్నారు. తెలంగాణ అంటేనే ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఇక్కడ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఢిల్లీలోని అగ్రనాయకుల చుట్టూ బీసీ లీడర్లు తిరగడమంటే పార్టీ పరువు పోవడమేనని పేర్కొన్నారు.
డిక్లరేషన్లన్నీ దండగేనా
ఉదయ్‌పూర్ డిక్లరేషన్, రాయ్‌పూర్ డిక్లరేషన్ అంటూ గొప్పగొప్ప సిద్ధాంతాలు రాసుకున్నారు కానీ.. అవన్నీ దండగేనా అని పొన్నాల ప్రశ్నించారు. ‘‘సీనియర్లను గౌరవిస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసినోళ్లను గుండెల్లో పెట్టుకుంటామన్నారు. కొత్తగా వచ్చినోళ్లకు ఐదేండ్లు పనిచేస్తేనే పదవులన్నారు. ఒక కుటుంబంలో ఒక్కరికే టికెట్ అన్నారు. డిజిటల్ మెంబర్షిప్ చేసిన వారికి, పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. కానీ, ఇప్పుడు పార్టీలో జాయిన్ కాకముందే ఆయా నేతలకు టికెట్లను అమ్ముకుంటున్నారు.
ఎవరో వ్యూహకర్త చెప్పిందే ఫైనల్ అని చెప్తూ.. సర్వేల్లో మీ పేరు లేదంటూ ఓ అనామకుడు చెప్పిన మాటలు వింటూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో పార్టీలో మనుగడ సాగించడం కష్టం’’ అని అన్నారు. ఓవైపు బీసీలకు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్సీ, కార్పొరేషన్, పార్టీ పదవులిస్తుంటే.. కాంగ్రెస్‌లో మాత్రం పీసీసీ అధ్యక్ష పదవులు నిర్వహించిన వారికి, ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీలు, వర్కింగ్ ప్రెసిడెంట్లను కలవడానికి హైకమాండ్ ఇష్టపడడం లేదని వాపోయారు.
అకారణంగా నన్ను తప్పించిన్రు
తెలంగాణకు తొలి పీసీసీ చీఫ్‌గా పనిచేసిన తనను 2015లో అకారణంగా పదవి నుంచి తప్పించారని పొన్నాల తెలిపారు. అయినా కూడా పార్టీ తరఫున అధికారపక్షంపై పోరాడానన్నారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంతో పాటు దేశమంతా ఘోర ఓటమి పాలైందని గుర్తు చేశారు. కానీ, రాష్ట్రంలో తన వల్లే ఓడిపోయిందంటూ బలిపశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2018లోనూ పార్టీ ఓడినా ఆనాటి రాష్ట్ర నాయకత్వంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. అదనంగా పదవులిచ్చారని ఆరోపించారు. 40 ఏండ్లపాటు పార్టీలో, 12 ఏండ్ల పాటు మంత్రిగా పనిచేసిన తన లాంటి సీనియర్లకే ఇంతటి అవమానాలు జరిగితే కాంగ్రెస్‌లో సగటు బీసీ నేత పరిస్థితేంటో తలచుకుంటేనే భయం వేస్తున్నదని ఆయన పేర్కొన్నారు.