
- ఇప్పటివరకు 68 కోట్ల మంది మహిళలు ఫ్రీ జర్నీ చేసిన్రు: మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకుని మహిళలు రూ.2,350 కోట్లు ఆదా చేసుకున్నారని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తెలిపారు. ఇప్పటి వరకు 68.60 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారని ఆయన చెప్పారు. ఆర్టీసీ సిబ్బంది నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేస్తుండడంతోనే ఈ స్కీమ్ విజయవంతంగా అమలవుతోందని మంత్రి వారికి అభినందనలు తెలిపారు.
శనివారం బస్ భవన్ లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. 12 ఏండ్ల తర్వాత ఆర్టీసీలో 3,035 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు. కొత్త బస్సుల కొనుగోలుతో మరిన్ని ఉద్యోగాలు వస్తాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2017కు సంబంధించిన పీఆర్సీని ప్రకటించిందని, పెండింగ్ ఆర్పీఎస్ బాండ్లకు సంబంధించిన రూ.200 కోట్లు త్వరలోనే విడుదల చేస్తుందని తెలిపారు. విడతల వారీగా ఆర్టీసీ ఉద్యోగులు పెండింగ్ బకాయిలను చెల్లిస్తామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 38 డిపోలు లాభాల్లో ఉన్నాయని, మిగతా డిపోలు కూడా వృద్ధి సాధించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని సిబ్బందికి సూచించారు.
త్వరలోనే బిలియన్ డాలర్ టర్నోవర్
ఆర్టీసీ సిబ్బంది కష్టపడి పనిచేస్తే త్వరలోనే సంస్థ బిలియన్ డాలర్ (రూ.8,500 కోట్లు) టర్నోవర్ కార్పొరేషన్ గా అవతరిస్తుందని ఎండీ సజ్జనార్ తెలిపారు. టీజీఎస్ఆర్టీసీ ప్రస్తుతం దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందని ఆయన తెలిపారు. ప్రతి రోజు సగటున 30 లక్షల మంది మహిళలను సంస్థ క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతోందని చెప్పారు.
రీయింబర్స్ కింద ఇప్పటివరకు రూ.1,740 కోట్ల నిధులు ప్రభుత్వం సంస్థకు రిలీజ్ చేసిందని తెలిపారు. అనంతరం కండక్టర్లు, డ్రైవర్లతో వర్చ్‌వల్‌గా మంత్రి ముచ్చటించారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ మెడికల్ ఫెసిలిటీ స్కీం కింద లభించే ప్రయోజనాలను స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సంస్థ వర్తింపజేసింది. ఈ మేరకు మార్పులు చేసిన సర్క్యులర్‌ను మంత్రి పొన్నం విడుదల చేశారు.