- ఎన్నికల్లో జనం ఓడించినా ఆయనలో మార్పు రాలేదని ఫైర్
- కేటీఆర్.. ముందు నీ ఇంటి సమస్యలు చక్కబెట్టుకో: పొంగులేటి
- కేటీఆర్‌కు మతి తప్పింది: ఆది శ్రీనివాస్
- అధికారం పోయినా.. అహంకారం తగ్గలే: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై, సీఎం రేవంత్‌పై కేటీఆర్ వాడిన భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కేటీఆర్‌లో అసహనం ఏ స్థాయికి చేరిందో అతని మాటలను బట్టి అర్థమవుతోందని ఆయన పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ లో ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని.. కానీ, ఇంతటి నీచమైన భాషను వాడడంతో కేటీఆర్ తన గౌరవాన్ని పొగొట్టుకున్నాడని అన్నారు.
‘‘ఇలాగే విమర్శిస్తే తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారు జాగ్రత్త కేటీఆర్’’ అంటూ పొన్నం హెచ్చరించారు. ఇప్పటికే తెలంగాణ జనం ఎన్నికల్లో బీఆర్ఎస్ కు, కేటీఆర్ కుటుంబానికి తగిన బుద్ధి చెప్పారని.. అయినా, ఆయనలో మార్పు రాలేదని, మరోసారి ఇలాగే మాట్లాడితే కాంగ్రెస్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
కేటీఆర్.. బలుపు మాటలు బంజెయ్: ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్
రాహుల్ పై, రేవంత్‌పై కేటీఆర్ బలుపు మాటలు మాట్లాడుతున్నాడని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. విచక్షణ కోల్పోయిన కేటీఆర్ తమ నేతలపై ఇలాంటి మాటలు మాట్లాడుతుండని, మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే తోడ్కలు తీస్తామని హెచ్చరించారు. వరుస ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతున్నా.. కేటీఆర్ కు మాత్రం బుద్ధి రాలేదని, చివరకు అసెంబ్లీని కూడా అగౌరవపరిచే మాటలు మాట్లాడుతుండని, స్పీకర్ దీనిపై జోక్యం చేసుకొని కేటీఆర్ కు నోటీసులు ఇవ్వాలని కోరారు.
క్షమాపణలు చెప్పకుంటే కేటీఆర్ ను అడ్డుకుంటం: పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని.. లేదంటే కేటీఆర్ ను అడుగడుగునా అడ్డుకుంటామని పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ హెచ్చరించారు. బుధవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ కు దమ్ముంటే కవిత చేసిన ఆరోపణలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. మీ పదేండ్ల దోపిడీ గురించి, దొంగ దందాల గురించి స్వయంగా మీ చెల్లె రాష్ట్రమంతా తిరిగి చెప్తుంటే తేలు కుట్టిన దొంగలా ఎందుకు మౌనంగా ఉన్నారని బండి సుధాకర్ ప్రశ్నించారు.
కేటీఆర్‌కు మతి తప్పింది: విప్ ఆది శ్రీనివాస్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ముందు మాట్లాడడానికి ధైర్యం లేని కేటీఆర్.. రోడ్ల వెంట తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. సర్పంచ్ ల అభినందనల సభల పేరుతో నానా యాగి చేస్తున్నాడని ధ్వజమెత్తారు.
ఇంట్లో కవిత పోరు, అసెంబ్లీలో హరీశ్ రావు గొడవతో కేటీఆర్ కు మతి తప్పిందని.. అందుకే కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కేటీఆర్ తన తీరు మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
అధికారం పోయినా.. అహంకారం తగ్గలే: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
కేటీఆర్ కు అధికారం పోయినా ఆయనలో అహంకారం ఏమాత్రం తగ్గలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. బుధవారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎంపీ ఎన్నికలు, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చివరకు సర్పంచ్ ఎన్నికల్లో జనం బీఆర్ఎస్ ను చెప్పుతో కొట్టినట్టు తీర్పు ఇచ్చినా కేటీఆర్ కు మాత్రం బుద్ధిరాలేదని ధ్వజమెత్తారు.
ఇప్పటికైనా కేటీఆర్ బలుపు మాటలు మాట్లాడడం మానుకోవాలని.. లేదంటే తెలంగాణ జనం పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టడం ఖాయమని హెచ్చరించారు.
