బీసీల గురించి మాట్లాడే అర్హత కవితకు లేదు : మంత్రి పొన్నం ప్రభాకర్

బీసీల గురించి మాట్లాడే అర్హత కవితకు లేదు : మంత్రి పొన్నం ప్రభాకర్
  • మంత్రి పొన్నం ప్రభాకర్​

హైదరాబాద్, వెలుగు: బీసీ బిల్లు కోసం కేసీఆర్ సహా ఎవరైనా తమతో కలిసి రావొచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సోమవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో  మాట్లాడారు. రాహుల్ గాంధీ మార్గదర్శకంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీ బిల్లును చట్ట రూపంలో గవర్నర్ వద్దకు పంపామని, ఆర్. కృష్ణయ్య తమకు ప్రధాని మోదీ అపాయింట్‌‌‌‌మెంట్ ఇప్పించి, ఈ బిల్లు అమలయ్యేలా సహకరించాలని కోరారు. బీసీల గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్సీ కవితకు లేదన్నారు. పదేండ్లు అధికారంలో ఉండి బీసీల గురించి మాట్లాడడం చేతగాని కవితకు, ఇప్పుడు బీసీలు గుర్తుకు వచ్చారా? అని ప్రశ్నించారు.

అలాంటి కవితకు ఆర్.కృష్ణయ్య మద్దతు తెలపడం సరికాదన్నారు. బీసీ బిల్లుకు రాజకీయ రంగు పులమడం మంచిది కాదని, బీసీల సంక్షేమం కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని కోరారు. బీసీలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉన్నదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మొత్తం క్యాబినెట్ ఈ విషయంలో ఒకే మాటతో ఉన్నామన్నారు.