- ఫిట్ నెస్ లేని, ఓవర్ లోడింగ్ వెహికల్స్‌ను సీజ్ చేయాలి
- మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం.. రవాణ శాఖ అధికారులతో సమీక్ష
- ఎన్‌ఫోర్స్‌మెంట్ కోసం జిల్లాస్థాయిలో 33 బృందాలు, రాష్ట్రస్థాయిలో 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోకి వచ్చే అంతర్రాష్ట్ర వాహనాలపై నిరంతరం నిఘా ఉంచాలని అధికారులను రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఫిట్‌నెస్ లేని, ఓవర్ లోడింగ్ వాహనాలను, దుమ్ము, ధూళి వెదజల్లే వెహికల్స్‌ను సీజ్ చేయాలని సూచించారు. బుధవారం సెక్రటేరియెట్‌లో రవాణా శాఖ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ సమీక్ష నిర్వహించారు.
కర్నూలు, చేవెళ్ల బస్సు ప్రమాదాలు, ఢిల్లీలో ఇతర రాష్ట్ర వాహనాల్లో బాంబు పేలుళ్లను దృష్టిలో ఉంచుకొని అంతర్రాష్ట్ర వాహనాలపై ఎన్ఫోర్స్మెంట్విస్తృత తనిఖీలు చేయాలన్నారు. ఇందుకోసం జిల్లాస్థాయిలో 33 ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు, రాష్ట్రస్థాయిలో 3 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
గత నెలలో రద్దయిన చెక్‌పోస్టుల వద్ద పనిచేసిన సిబ్బందిని కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో పనిచేసేలా ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. మహిళలకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం కోసం మహిళా ఆటోలకు అనుమతులు ఇచ్చేందుకు కార్యాచరణ చేపట్టాలని అన్నారు. వచ్చే నెలంతా రోడ్డు భద్రతా ఉత్సవాలు నిర్వహించనున్నందున పిల్లలకు రోడ్ సేఫ్టీపై వ్యాస రచన పోటీలు, ఇతర వినూత్న ప్రోగ్రామ్‌లు నిర్వహించాలని సూచించారు.
ప్రజల్లో కూడా విస్తృతమైన అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ఈ వారం వ్యవధిలో నిర్వహించిన తనిఖీల్లో 2 వేల 576 వెహికల్స్‌పై కేసులు నమోదు చేసినట్లు మంత్రికి అధికారులు వివరించారు. ఈ సమావేశంలో రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్, కమిషనర్ ఇలంబర్తి, జేటీసీలు రమేశ్, చంద్ర శేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
