పదేండ్లలో మీకు పూలే గుర్తుకు రాలేదా? : పొన్నం ప్రభాకర్

పదేండ్లలో మీకు పూలే గుర్తుకు రాలేదా? : పొన్నం ప్రభాకర్

“పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు యాదికి లేని మహాత్మా జ్యోతిరావు పూలేను.. మీకు ఎరుకజేసిన తెలంగాణ ఓటర్ల చైతన్యానికి వందనం. అణచివేతకు వ్యతిరేకంగా పూలే నడిపిన పోరాటమే మా ప్రభుత్వానికి ఆదర్శం.. అందుకే ప్రగతిభవన్​కు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్ అని పెట్టుకున్నాం, ప్రజాపాలన అందిస్తున్నాం ”  అని ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.  అణగారిన జీవితాల్లో వెలుగుల దారులు పంచిన మహోన్నతుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని,  ఆ మహనీయుడి విగ్రహం అసెంబ్లీ లో ప్రతిష్ఠించాలని ఎమ్మెల్సీ కవిత కోరడం మరీ విడ్డూరమని సోమవారం ఆయన ట్వీట్ లో పొన్నం ఎద్దేవా చేశారు.

అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని స్పీకర్ కు ఎమ్మెల్సీ కవిత వినతిపత్రం ఇవ్వటంపై మంత్రి పై విధంగా స్పందించారు. ‘‘పూలే మాకు సర్వదా స్మరణీయుడు. బీసీ లను వంచించిన మీరా బీసీల సంక్షేమం గురించి మాట్లాడేది?” అని ఆయన ప్రశ్నించారు.  “ మీ నియంత్రుత్వానికి ఎదురు తిరిగితే  ఒక బీసీ మహిళ అని చూడకుండా జగిత్యాల మున్సిపల్ చైర్సన్ ను ఏడిపించింది మీరు కాదా.. బీసీ బిడ్డగా అడుగుతున్నా.. మీ నియోజకవర్గంలో ఎంతమంది బీసీలకు మీరు అధికారాలు ఇచ్చారు .

బీసీ మంత్రిగా ఉన్నా.. నేను ఉద్యమకారుడినే.. అణగారిన వర్గాలకు ఆప్తున్ని, సబ్బండ కులాలకు సోదరుడిని.. మంత్రిగా ఉండి బీసీల హక్కుల కోసం పోరాడుతా.  మీ పార్టీ అధ్యక్ష పదవి, కార్యనిర్వహక అధ్యక్ష పదవి, లీడర్ ఆఫ్ అపొజిషన్ బీసీలకు ఇవ్వగలరా..  గత మీ ప్రభుత్వంలో శాసన సభ స్పీకర్ .. శాసన మండలి చైర్మన్ బీసీ లకు ఎందుకు ఇవ్వలేదు” అని పొన్నం ప్రశ్నించారు. 

దేవుడి ఫొటోలు పెట్టి రాజకీయం చెయెద్దు

“  నేను జన్మతః హిందువుని.. నిన్న గుడికి పోయా.. ఈరోజు గుడికి పోయా.. రేపూ పోతా.. నుదుట బొట్టు పెట్టుకుంటా.. దేవుడంటే భక్తి, భయం, శ్రద్ధ.. మీరు చెప్పినట్టు వినకపోతే నేను హిందువుని కాదా..”  అని పొన్నం ప్రశ్నించారు.  దేవుడి ఫొటోలు పెట్టి రాజకీయం చేయొద్దని బీజేపీని ఉద్దేశించి పొన్నం సోమవారం ట్వీట్ లో వ్యాఖ్యానించారు.  తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు గత 10 ఏండ్లుగా ఎం చేశారో చెప్పాలని ఆయన పొన్నం డిమాండ్​ చేశారు.