- కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి పొన్నం విజ్ఞప్తి
- భారత్ మండపంలో 43వ రవాణా అభివృద్ధి మండలి మీటింగ్
- తెలంగాణ రవాణా శాఖ సంస్కరణలను వివరించిన పొన్నం
- త్వరలో వాహన్ అప్లికేషన్ తీసుకురానున్నట్లు వెల్లడి
- పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటన
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో రెండు డ్రైవింగ్ శిక్షణ అండ్ పరిశోధన కేంద్రాలు (ఐడీటీఆర్), డిస్ట్రిక్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. తెలంగాణ రైజింగ్ ‘విజన్ 2047’ లో భాగంగా రవాణా శాఖ చేపట్టిన సంస్కరణలను మంత్రి వివరించారు. తెలంగాణలో ప్రపంచస్థాయి ట్రాన్స్ పోర్ట్ అకాడమీ ఏర్పాటు చేయడంతోపాటు సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ ఇన్ డ్రైవింగ్ రోడ్ సేఫ్టీ ఉండేలా కార్యచరణ తీసుకున్నట్లు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ట్రక్ టెర్మినల్, పార్కింగ్ యార్డుల అభివృద్ధి, హైదరాబాద్ లో ప్రైవేట్ బస్టాండ్ల నిర్మాణం, పాస్‌పోర్ట్ ఆఫీసుల తరహాలో ఆర్టీఓ కార్యాలయాలను ఆధునీకరిస్తామన్నారు. గురువారం ఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన అన్ని రాష్ట్రాలు/యూటీల రవాణా శాఖ మంత్రుల ‘రవాణా అభివృద్ధి మండలి’ 43వ మీటింగ్ జరిగింది.
ఇందులో మంత్రి పొన్నం ప్రభాకర్,స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, ఇతర రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖలో తీసుకురానున్న మార్పులను మంత్రి వివరించారు. డ్రైవింగ్ లైసెన్సు కు సంబంధించిన ‘సారథి’ ఆన్లైన్ పోర్టల్‌ను అమలు చేస్తున్నామని, వాహనాల రిజిస్ట్రేషన్ కోసం వాహన్ (ఎన్ఐసీ) అప్లికేషన్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఈ సారథి, వాహన్ వల్ల ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం వెళ్లినప్పుడు మైగ్రేషన్ఈజీ అవుతుందన్నారు.
ఓఆర్ఆర్ లోపల ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం
హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ తీసుకున్నదని మంత్రి వివరించారు. 2024 నవంబర్ లో తెచ్చిన ఈవీ పాలసీ కారణంగా 2025 లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. భవిష్యత్‌లో ఓఆర్ఆర్ లోపల కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) మాత్రమే నడిచే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.
తొలుత పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు, తర్వాత ఈవీ టాక్సీలు, ఆటోలు, ఇతర కమర్షియల్ వాహనాలకు వర్తింపజేస్తామన్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో భారీగా ఎలక్ట్రిక్, ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలకు అనుమతి ఇవ్వడంతో పాటు డీజిల్ ఆటోల స్థానంలో రేటిరోఫిట్కు అనుమతి ఇచ్చినట్టు చెప్పారు. అలాగే.. రాష్ట్రంలో 2024లో కొత్త స్క్రాప్ పాలసీని ప్రకటించామన్నారు. పాత వాహనాలను స్క్రాప్ చేస్తే.. ట్యాక్స్ తగ్గింపు, పెనాల్టీ రద్దు వంటి ప్రోత్సాహకాలను ఇస్తున్నట్టు చెప్పారు.
