కేంద్ర ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టిస్తుండ్రు

కేంద్ర ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టిస్తుండ్రు

అభివృద్ధి పనుల్లో బీజేపీ నాయకులనూ భాగస్వాములుగా చేయాలి
‘దిశ’ కమిటీ మీటింగ్​లో ఎంపీ అర్వింద్​

నిజామాబాద్,  వెలుగు: కేంద్ర  ప్రభుత్వ నిధులతో  జిల్లాలో సాగుతున్న  అభివృద్ధి పనుల్లో, సెంట్రల్​ స్కీమ్​ల  అమలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని ఎంపీ అర్వింద్​ అన్నారు.  సెంట్రల్​ గవర్నమెంట్​ నిధులను   రాష్ట్రంలో పక్కదారి  పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.   జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్​ లో  జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ  (దిశ ) మీటింగ్ బుధవారం జరిగింది. ఎంపీ  అర్వింద్​  అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతీరు సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్​ మాట్లాడుతూ..   కేంద్ర ప్రభుత్వ నిధులను ఉపయోగించి జిల్లాలో చేస్తున్న పనులను రాష్ట్రం తన ఖాతాలో వేసుకుంటుందని అన్నారు.  దీంతోపాటు ఆ పనుల్లో నాణ్యత లోపాలు బయటపడుతున్నాయని చెప్పారు. 

సర్వశిక్షా అభియాన్​నిధుల మళ్లింపు పై  ఎంపీ సీరియస్​.. 
సర్వ శిక్షా అభియాన్​ స్కీమ్​ కింద కేంద్రం  ఏటా రూ. వందల కోట్లు విడుదల చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం   జిల్లాకు విడుదల చేయడంలేదని ఎంపీ అర్వింద్​ ఆరోపించారు. 2018–-19 వ విద్యాసంవత్సారానికి 1100 కోట్లు,  2019–‌‌‌‌-20లో 350 కోట్లు , 2020-– 2021 లో 550 కోట్లు 2021–22వ సంవత్సరానికి రూ. 500 కోట్లు విడుదలయ్యాయని గుర్తు చేశారు.  విద్యారంగాభివృద్ధికి కేటాయించాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లిస్తోందన్నారు.  స్కూళ్లలో  అదనపు గదులు నిర్మాణం, మరమ్మతులు, మెరుగైన సదుపాయాలు కల్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.  మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం అందడం లేదని  సభ్యులు అధికారులను ప్రశ్నించారు.  102 స్కూళ్లలో  భోజనంలో ఎగ్స్​ కూడా పెట్టడం  లేదని ఫిర్యాదు చేశారు. గుడ్డు ధర పెరగడంతో  ఏజెన్సీలు ఎగ్స్​ పెట్టట్లేదని విద్యాశాఖ అధికారులు తెలిపారు.   ప్రైమరీ స్కూళ్లలో కుక్ , హెల్పర్లు 2, 283 మంది జీతాలకు రూ. 3.5 కోట్లు  కేటాయిస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు.   

ఫసల్​ బీమా  పరిహారం అందలే..
రాష్ట్ర ప్రభుత్వం ఫసల్​ బీమా అమలు చేయకపోవడంతో  పంట నష్టపోయిన రైతులకు అన్యాయం జరుగుతోందని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.   జిల్లాలో  46వేల మంది  రైతులకు పరిహారం అందలేదని,   గత ఖరీఫ్​లో 46 వేల మంది రైతులు ప్రీమియం కట్టగా,  రబీలో 10 వేల మంది మాత్రమే ప్రీమియం కట్టారని అన్నారు. 2018, 2019, 2020  సంవత్సరాల ప్రీమియం చెల్లించలేదని దీంతో పంటనష్టపోయిన రైతులకు పరిహారం అందలేదని  ఆయన పేర్కొన్నారు.  రైతు బీమా వయో పరిమితి 59 ఏండ్ల వయస్సు నిర్ణయించడంతో  ఆకస్మికంగా మరణించిన రైతు కుటుంబాలు నష్టపోతున్నాయని  అన్నారు. రైతు బీమా పథకానికి వయో పరిమితి సడలించాలని  డిమాండ్​ చేశారు. చెక్ డ్యాంల నిధులు రాష్ట్రం ఇస్తుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ మీటింగ్​లో కలెక్టర్​  నారాయణ,  అడిషనల్​ కలెక్టర్​ చిత్రామిశ్రా,  జిల్లా ఫారెస్ట్​ ఆఫీసర్​ సునీల్​ హీరామత్​, డీఆర్​ఎడీఓ చందన, జడ్పీ సీఈఓ గోవింద్​ తదితరులు పాల్గొన్నారు. 

పనుల్లో నాణ్యతలోపం 
కేంద్ర నిధులతో  జిల్లాలో చేస్తున్న పనుల్లో  నాణ్యత లేదని   సభ్యులు ఆందోళన  వ్యక్తం చేశారు. సిరికొండ, వర్ని మండలాల్లో  వాటర్​ షెడ్​ పనులకు రూ. 19 కోట్లు కేటాయించినా.. డీపీఆర్​  ఇవ్వలేదని  ఆగ్రహించారు.  జిల్లాలో మొత్తం 30 చెక్​ డ్యామ్​ లకు  కేంద్రం రూ. 60 కోట్ల నిధులు విడుదల చేసిందని,  ఆ చెడ్​ డ్యామ్​లు   వర్షాలకు కొట్టుకుపోవడం ఏమిటని  నాణ్యతలోపాలపై ఇరిగేషన్​ అధికారులను సభ్యులు నిలదీశారు.   అయితే  దిశా మీటింగ్​లో సభ్యులుగా ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతిసారి కమిటీ మీటింగ్​కు దూరంగా ఉంటున్నారు.   సమావేశాలకు హాజరై,  కేంద్ర ప్రభుత్వ పథకాల నిధుల వినియోగంతో  జరుగుతున్న పనులపై చర్చించాల్సి ఉన్నా.. హాజరు కాకపోవడం విమర్శలకు తావిస్తోంది.