చెన్నూరు, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కిష్టంపేటలో భార్యను ఓ భర్త దారుణంగా హత్య చేశాడు. గ్రామానికి చెందిన గాలిపెల్లి పోశం, శంకరమ్మ(45) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. మందుకు బానిసైన పోశం రోజూ ఇంట్లో గొడవపడ్తుండేవాడు.
బుధవారం రాత్రి అన్నం తింటుండగా కూర విషయంలో భార్యతో గొడవ జరిగింది. మాటామాట పెరగడంతో కోపంతో ఊగిపోయిన పోశం అర్ధరాత్రి నిద్రిస్తున్న శంకరమ్మపై గొడ్డలితో దాడి చేశాడు. మెడపై నరకడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. పోశం పరారయ్యాడు. టౌన్సీఐ వాసుదేవరావ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

