తల్లీబిడ్డల ఆరోగ్యంపై ఫోకస్.. సెప్టెంబర్ నుంచి స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్

తల్లీబిడ్డల ఆరోగ్యంపై ఫోకస్..  సెప్టెంబర్ నుంచి స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్
  • 15 రోజుల పాటు మహిళల కోసం హెల్త్​ క్యాంపులు
  • గర్భిణులు, చిన్నారుల కోసం పోషణ్​ మాసోత్సవం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తల్లీ బిడ్డల ఆరోగ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్​ ఫోకస్​ పెట్టాయి. ఇందుకోసం పోషణ్​ అభియాన్, స్వస్థ్​ నారీ, సశక్త్​ పరివార్​ అభియాన్ అమలు చేస్తున్నాయి. ఈ కార్యక్రమంతో ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులు, కిషోర బాలికలు, గర్భిణులు, బాలింతలకు లాభం చేకూరనుంది. మరో వైపు హెల్త్​ క్యాంపులు నిర్వహించి ఫ్రీగా అన్ని రకాల టెస్టులు చేస్తున్నారు. బుధవారం నుంచి పోషణ్ ​ మాసోత్సవాలతో పాటు స్వస్థ్ నారీ సశక్త్​ పరివార్ అభియాన్ మొదలు కానున్నాయి. ఈ ప్రోగ్రాం నిర్వహణ కోసం ప్రభుత్వం జిల్లాకు రూ. 50 వేలు, ఐసీడీఎస్​ ప్రాజెక్టుకు రూ. 30వేలు కేటాయించింది. 

 జిల్లాలోని 11ఐసీడీఎస్​ ప్రాజెక్టుల పరిధిలో పోషణ్ మాసోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ప్రాజెక్టుల పరిధిలో 2,060 అంగన్​వాడీ సెంటర్లున్నాయి. 6,337 మంది గర్భిణులు, 6,336 మంది బాలింతలు, 58,250 మంది ఐదేండ్ల లోపు చిన్నారులు ఉన్నారు. 3,645 మంది పిల్లలు ఎత్తు, బరువు, రక్తహీనతతో బాధ పడ్తున్నట్టు గుర్తించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గర్బిణులు, బాలింతలు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తారు. 

మహిళలు, పిల్లలు పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సి అవసరాన్ని వారికి వివరిస్తారు. వోకల్​ ఫర్​ లోకల్​ నినాదంతో గ్రామీణ ఉత్పత్తులను ప్రోత్సహించేలా అవగాహన కల్పిస్తారు. నాలుగు వారాల పాటు నిర్వహించే కార్యక్రమాల వివరాలను చైల్డ్​ వెల్ఫేర్​ డిపార్ట్​మెంట్​ ఇప్పటికే ప్రకటించింది. 

మొదటివారం పిల్లల పోషణపైగర్భిణులు, పాలిచ్చే తల్లులతో అంగన్​వాడీ కేంద్రాల్లో సమావేశాలు నిర్వహిస్తారు. మహిళలతో పాటు పురుషులకు వంటల పోటీలు, బాలికలు, పిల్లల బరువు ఎత్తు కొలిచి.. పోషకాహార ప్రతిజ్ఞ చేయిస్తారు. స్థానిక ఉత్పత్తులపై అవగాహన కల్పిస్తారు. రెండో వారంలో ముర్రు పాల ఆవశ్యకత, పౌష్టికాహారం, జీవనశైలి, పోషణలో తల్లిదండ్రుల భాగస్వామ్యం, బిడ్డ శరీరం, మెదడు పెరుగుదల కోసం మొదటి మూడేండ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు. మూడో వారంలో పోషణ లోపాలు తీవ్రంగా ఉన్న పిల్లలకు ఆకలి పరీక్షలు చేస్తారు. గ్రోత్​ మానిటరింగ్​లో హాజరుకాని పిల్లల బరువు, ఎత్తులను కొలుస్తారు. పోషణ లోపం ఉన్న పిల్లల వివరాలను సేకరిస్తారు. 

నాలుగో వారంలో పరిశుభ్రమైన తాగునీరు, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తారు. తక్కువ చక్కెర, నూనెలతో తయారు చేసే వంటకాలను ప్రదర్శిస్తారు. ప్లాస్టిక్ బ్యాగుల వల్ల కలిగే నష్టాలను వివరిస్తారు. స్కూళ్లలో వ్యాస రచన, క్రీడా పోటీలు చేపడతారు. రక్తహీనత, కిచెన్​ పరిశుభ్రత, గార్డెన్ల ఏర్పాటుపై కిశోర బాలికలకు అవగాహన కల్పిస్తారు. 

స్వస్థ్​నారీ, సశక్త్​పరివార్​అభియాన్​లో భాగంగా బుధవారం నుంచి 15రోజుల పాటు పీహెచ్​సీలు, గవర్నమెంట్​ హాస్పటల్స్​లో మహిళల కోసం ప్రత్యేకంగా హెల్త్​ క్యాంపులు నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా మెగా హెల్త్​ క్యాంపులు నిర్వహించి మహిళల్లో బీపీ, షుగర్​, క్యాన్సర్​, టీబీ వంటి వ్యాధులను గుర్తిస్తారు. అవసరమైన వారికి 
ట్రీట్​మెంట్​ అందిస్తారు. 

నెల రోజుల పాటు అవగాహన

 పోషణ్​ అభియాన్​లో భాగంగా నెల రోజుల పాటు అంగన్​వాడీ సెంటర్లలో పౌష్టికాహారం, రక్తహీనత, ముర్రుపాల ఆవశ్యకతపై మహిళలకు అవగాహన కల్పిస్తాం. ప్రభుత్వం సూచించిన రోజువారీ ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలను నిర్వహిస్తాం.  స్వర్ణలత లెనినా, పీడీ, ఐసీడీఎస్​