జడ్పీ చైర్ పర్సన్లే సుప్రీంలు

జడ్పీ చైర్ పర్సన్లే సుప్రీంలు

జిల్లా పరిషత్​ చైర్​పర్సన్లకు కీలక బాధ్యతలు అప్పగించాలని టీఆర్​ఎస్​ నాయకత్వం కసరత్తు చేస్తోంది. పార్టీని బలోపేతం చేసేందుకు ఈ కొత్తతరాన్ని  ప్రోత్సహించాలని భావిస్తోంది. పార్టీ కార్యక్రమాల్లోనైనా, ప్రభుత్వ వ్యవహారాల్లోనైనా జడ్పీ చైర్​పర్సన్లనే ముందువరుసలో ఉంచాలని యోచిస్తోంది. రాష్ట్రంలో 32 జిల్లా పరిషత్​లకు ఇటీవల ఎన్నికలు జరుగగా మొత్తం జడ్పీలను అధికార పార్టీ టీఆర్​ఎస్​ గెలుచుకుంది. ఆ పార్టీ నుంచే 32 మంది జడ్పీ చైర్మన్లు, 32 మంది జడ్పీ వైస్​ చైర్మన్లు అయ్యారు. వీరిలో ఎక్కువ మంది కొత్త తరం నేతలే. కొత్తతరాన్ని ప్రోత్సహిస్తే పార్టీ మరింత బలపడుతుందని  టీఆర్​ఎస్​ అధినాయకత్వం బలంగా నమ్ముతోంది. ఈ జడ్పీలు వచ్చే నెల 4న ఉనికిలోకి రానున్నాయి. మొత్తం జడ్పీ చైర్​పర్సన్లు, వైస్‌  చైర్​పర్సన్లతో  ఇటీవల ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. జిల్లా పరిషత్‌లకు అధికారాలు కల్పించి పూర్వ వైభవం తీసుకురాబోతున్నట్టు ఆయన చెప్పారు. రెవెన్యూ వ్యవస్థపైనా అధికారాలు కల్పించేందుకు చట్ట సవరణ తీసుకురాబోతున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు త్వరలోనే ఆర్డినెన్స్‌ జారీ చేసే అవకాశముంది. బడ్జెట్‌ సమావేశాల్లో అసెంబ్లీ, కౌన్సిల్‌లో ఈ ఆర్డినెన్స్‌ను ఆమోదింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జడ్పీ చైర్​పర్సన్లకు పరిపాలనపరమైన అధికారాలు బదలాయింపు చేయడంతోపాటు పార్టీలోనూ వారికే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మంత్రులు ఉన్న జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో జడ్పీ చైర్​పర్సన్లకే అన్ని అధికారాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర కేబినెట్‌లో సీఎం కాక 11 మంది మంత్రులున్నారు. ఇంకా ఆరు కేబినెట్‌ బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ నుంచి ఇద్దరు చొప్పున మంత్రులున్నారు. వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి ఒక్కో మంత్రి ఉన్నారు. మెదక్‌ నుంచి సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఖమ్మం నుంచి కేబినెట్‌లో ఎవరికీ చోటు దక్కలేదు. ఇద్దరు మంత్రులకే పూర్తిస్థాయిలో పాత జిల్లాలపై అధికారాన్ని కొనసాగించే అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. మిగతా వారంతా ప్రస్తుత వారి వారి కొత్త జిల్లాలకే పరిమితం అయ్యే చాన్స్​ కనిపిస్తోంది. దీంతో మిగిలిన జిల్లాల్లో జడ్పీ చైర్​పర్సన్లే సుప్రీంలు కానున్నారు. పార్టీ బలోపేతంతో పాటు పాలనలో వారినే ముందుంచాలని టీఆర్​ఎస్​ భావిస్తోంది. రాష్ట్రంలో మంత్రుల తర్వాతి స్థానంలో జడ్పీ చైర్​పర్సన్లకే కీలకం కానున్నారు.

జడ్పీ చైర్​పర్సన్లకు  పెద్ద పీట.. ఎమ్మెల్యేలకు కోత…

గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంతో పాటు పార్టీ జిల్లా కమిటీలను పునరుద్ధరించాలని టీఆర్​ఎస్​ నాయకత్వం ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో జడ్పీ చైర్​పర్సన్లు సమన్వయం చేసుకుంటూ పరిపాలన వ్యవహారాలను నడిపించాల్సి ఉంటుందని సమాచారం. జిల్లా స్థాయి బదిలీలు, పోస్టింగుల్లోనూ జడ్పీ చైర్​పర్సన్లకే ప్రాధాన్యమిచ్చే చాన్స్​ ఉన్నట్లు సమాచారం.

ఆరునెలలకోసారి సీఎంతో సమావేశాలు?..

2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జడ్పీ చైర్​పర్సన్లతో సీఎం కేసీఆర్‌ సమన్వయం చేస్తూ పరిపాలన సాగిస్తారని సమాచారం. జడ్పీ చైర్​పర్సన్లు, వైస్​ చైర్​పర్సన్లతో  కనీసం ఆరు నెలలకు ఒకసారి ఆయన సమావేశమయ్యే అవకాశముంది. పాలనలో తమ మార్క్‌ చూపించే జడ్పీలకు రూ.10 కోట్ల చొప్పున నజరానాను సీఎం ప్రకటించారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థ మీద సర్వాధికారాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మిగతా వ్యవస్థలనూ జడ్పీల ఆధీనంలోకి తీసుకురావడానికి అవసరమైన చట్ట సవరణ చేసే యోచనలో ఉన్నారు. బాగా పనిచేసే జడ్పీ చైర్మన్లకు ఇతరత్రా రాజకీయ అవకాశాలు కల్పించే యోచనలో టీఆర్​ఎస్​ ఉన్నట్లు తెలిసింది. జడ్పీ చైర్​పర్సన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జట్టుగా పనిచేయాలని సూచిస్తోంది. పార్టీ కోసం పనిచేయాలని ఎమ్మెల్యేలకూ సూచనలు ఇచ్చింది.