కరోనా టెస్టులో పాజిటివ్.. మెసేజ్​లో నెగెటివ్

కరోనా టెస్టులో పాజిటివ్.. మెసేజ్​లో నెగెటివ్
  • ఏది నిజమో తెలియక అయోమయంలో జనాలు
  • మళ్లీ టెస్టుల కోసం ప్రైవేటు సెంటర్లకు పరుగులు 
  • టెక్నికల్ ప్రాబ్లమ్ అంటున్న మెడికల్​ ఆఫీసర్లు 

“లంగర్​హౌస్​ పరిధిలోని సన్​సిటీకి చెందిన సుధారాణి జలుబుతో బాధపడుతూ కొవిడ్ ​టెస్టు కోసం గోల్కొండ ఏరియా హాస్పిటల్​కి సోమవారం వెళ్లింది. అక్కడ యాంటిజెన్​ టెస్టు చేయించుకుంది. పాజిటివ్​వచ్చిందని మెడిసిన్​​ ఇచ్చి హోమ్ ఐసోలేషన్​లో ఉండాలని మెడికల్​ సిబ్బంది చెప్పి పంపించారు. సాయంత్రం ఆమె ఫోన్​కి నెగెటివ్​ రిపోర్ట్​ మెసేజ్​వచ్చింది. ఇంతకు తనకు కరోనా ఉందా.. లేదా? అని ఆమెకు టెన్షన్ పట్టుకుంది. మళ్లీ ఓ ప్రైవేట్ ​సెంటర్​ కు వెళ్లి ఆర్టీపీసీఆర్​టెస్టుకు శాంపిల్​ ఇచ్చింది.’’

కరోనా టెస్టులు చేసుకుంటున్న వారు అయోమయంలో పడుతున్నారు. సెంటర్ల వద్ద టెస్టులు చేయగానే పాజిటివ్​వచ్చిందని హెల్త్ స్టాఫ్ ​చెప్పి మెడిసిన్​ఇచ్చి హోమ్ ఐసోలేషన్​లో ఉండాలని సూచిస్తున్నారు. అదే రోజు సాయంత్రం ఫోన్లకు  టెస్ట్ ​రిపోర్ట్ ​మెసేజ్​లు వస్తున్నాయి. అందులో నెగెటివ్ ​వచ్చినట్లు ఉంటోంది. ఇలా ఒకరికి ఇద్దరికి కాదు.. వందలాది మందికి ఇలాగే వస్తున్నాయి.  వాటిని చూసుకున్న బాధితులు తమకు కరోనా వచ్చిందా?  రాలేదా అని ఆందోళన చెందుతున్నారు. వెంటనే ప్రైవేటు సెంటర్లకు వెళ్లి మరోసారి టెస్టులు చేయించుకుంటున్నారు. మరికొందరు  నెగెటివ్​వచ్చిందని ఇష్టానుసారంగా బయట తిరుగుతున్నారు. ఇంకొందరికి అసలు మెసేజ్​లే రావడం లేదు. మెడికల్​ సిబ్బంది పొరపాట్లతోనే రిజల్ట్​ సరిగా తెలియడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులను అడిగితే టెక్నికల్​ ప్రాబ్లమ్స్ ​వల్ల  మెసేజ్​లు తప్పుగా వస్తున్నట్లు, సెంటర్​ వద్ద చెప్పిందే నిజమని పేర్కొంటున్నారు. 
 
కొందరికి మెసేజ్​లు వస్తలేవు 

మెసేజ్​లు వస్తున్న వారికి తప్పుడు రిపోర్టుల వస్తుంటే, చాలామందికి అసలు మెసేజ్​లే రావడం లేదు. సిటీలో డైలీ12 వేల టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇందులో వేయి మంది వరకు ఫోన్లకు మెసేజ్​లు వస్తలేవు. సెంటర్​ వద్ద ఎక్కువ మంది ఉండడంతో కొందరికి రిజల్ట్​ చెప్పలేకపోతున్నారు. అలాంటి వారికి  మెసేజ్ రాకపోతే రిజల్ట్ ఏదో కూడా తెలియని పరిస్థితి ఉంది. కొందరికి టెక్నికల్​ ప్రాబ్లమ్స్​ వల్ల రాకపోతే, మరికొందరి ఫోన్​ నంబర్లు ట్యాబ్​లో ఎంట్రీ చేసే సమయంలో తప్పుగా చేస్తుండగా ఈ ఇబ్బంది వస్తోంది. ఒక్కో సెంటర్​కి డైలీ వందలాది మంది వస్తుండడంతో ఫోన్ నంబర్లు రాసుకునే సమయంలో మెడికల్​ సిబ్బంది తప్పుగా తీసుకుంటున్నారు. టెక్నికల్​ ప్రాబ్లమ్స్​తో పాటు సిబ్బంది తప్పిదాల వల్ల కూడా మెసేజ్​లు రావడంలేదు.

సరైన రిజల్ట్​ రావడం లేదని..

ప్రభుత్వ సెంటర్లను చాలా మంది నమ్మడం లేదు. అక్కడ జనం ఎక్కువగా ఉంటుండడంతో ప్రైవేట్​లో చేయించుకుందామని అనుకుంటున్నారు. అందులో రిపోర్టులు ఇలా తారుమారుగా వస్తుండడంతో ఉన్న కాస్త నమ్మకం పోతోంది. తప్పుడు రిపోర్టులు వస్తున్న వారిలో చాలా మంది తిరిగి ప్రైవేట్​ సెంటర్లలో టెస్టులు చేయించుకుంటున్నారు. సర్కార్​ సెంటర్లకు వెళితే సరైన రిజల్ట్​ రావడంలేదని, అందుకే  ప్రైవేట్​సెంటర్లకు వెళ్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. 

మళ్లీ టెస్టుల కోసం
   
తప్పుగా మెసేజ్​లు వచ్చిన వారు టెన్షన్ తో మరుసటి రోజు మళ్లీ టెస్టులు చేసుకునేందుకు సెంటర్లకు వెళ్తున్నారు. అంతకు ముందు రోజు టెస్ట్​ చేసుకున్న సెంటర్​ కి వస్తే చేయకపోతుండడంతో వేరే ఏరియాలకు వెళ్తున్నారు. సెంటర్​దగ్గర పాజిటివ్​అని చెప్పి ఇంటికెళ్లాక నెగటివ్​అని మెసేజ్ లు వస్తున్నాయంటున్నారు.  ఏది నిజమో తెలియక మళ్లీ టెస్టులు కోసం వస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు.  

కొత్త యాప్​తోనే సమస్య 

కొత్త యాప్​తోనే  సమస్యలు వస్తున్నట్టు మెడికల్​ ఆఫీసర్లు చెబుతున్నారు. మొన్నటి వరకు స్టేట్​ల్యాబ్ మేనేజ్ మెంట్ సిస్టం యాప్​ ద్వారా కొవిడ్​ రిపోర్టులు అప్ లోడ్​ చేసేవారు. ఇందులో సెంటర్ వద్ద టెస్టింగ్​కి ముందు మొబైల్​కి ఓటీపీ వచ్చాక, ఆ నంబర్​ని ఆన్​లైన్​లో ఎంట్రీ చేసి శాంపిల్ ​కలెక్ట్​ చేసేవారు. ఈ రిపోర్టులతో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. వారం రోజుల నుంచి స్టేట్​ కొవిడ్​–19 టెస్టింగ్ కొత్త యాప్​ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో పాత దాంట్లో మాదిరిగా అన్ని వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం మొబైల్​ నంబర్​ చెబితే సరిపోతుంది. దీంట్లో ఓటీపీ ఆప్షన్​ లేదు. ఈ యాప్ ​వల్ల టెస్టులు తొందరగా అవుతుండగా టెక్నికల్​ప్రాబ్లమ్స్​తో  ఇబ్బందులు వస్తున్నాయి.