- సమగ్ర శిక్ష ద్వారా శుభ్రత, విద్యార్థుల రక్షణే లక్ష్యం
 - ప్రత్యేక కమిటీ ద్వారా
 - నిర్దేశిత పనుల పూర్తికి చర్యలు
 - రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో ఈనెల 25 వరకు అమలు
 
మెదక్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా సర్కారు బడుల్లో ఆహ్లాదకరమైన, ఆరోగ్యకర వాతావరణం కల్పించేందుకు విద్యాశాఖ 5.0 సేఫ్అండ్క్లీన్ప్రోగ్రామ్ చేపట్టింది. పాఠశాల ప్రాంగణాలు, తరగతి గదులు, వంట గదులు, టాయిలెట్లను పరిశుభ్రంగా మార్చడం, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు, అపాయం తలెత్తకుండా భద్రత కల్పించేలా స్కూళ్లను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉంటుంది. రాష్ట్ర సర్కార్ ఇప్పటికే విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుండగా.. సమగ్ర శిక్షలో భాగంగా ప్రోగ్రామ్ ద్వారా బడుల రూపు రేఖలు కూడా మార్చనుంది. గత నెల 31 నుంచి ప్రారంభమైన 5.0 సేఫ్అండ్క్లీన్ప్రోగ్రామ్ ఈనెల 25 వరకు రాష్ట్రంలోని అన్ని సర్కార్ స్కూళ్లలో అమలు చేయాలని సమగ్ర శిక్ష స్టేట్‌ప్రాజెక్ట్ డైరెక్టర్(ఎస్పీడీ) నవీన్ నికోలస్ఉత్తర్వులు జారీ చేశారు.
కమిటీ చేపట్టే పనులివే..
స్కూల్ బిల్డింగ్ దెబ్బ తింటే రిపేర్ చేయించాలి. సున్నం, రంగులు వెలిసి పోతే వేయించాలి. కిచెన్షెడ్సౌకర్యవంతంగా వంటకు, పాత్రలు కడిగేందుకు నీటి వసతి ఉండేలా చూడాలి. గ్యాస్ లీకేజీ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సిలిండర్నుంచి స్టవ్‌కు గ్యాస్ సరఫరా చేసే ట్యూబ్‌లు ఐఎస్ఐ స్టాండర్డ్ ఉన్నవి మాత్రమే వినియోగించాలి. తాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వాటర్ ట్యాంక్‌ను పరిశుభ్రంగా ఉండేలా చూడాలి.
విద్యార్థులు భోజనం చేశాక చేతులు, ప్లేట్లు కడుక్కునే ట్యాప్ ల వద్ద క్లీన్ గా ఉంచాలి. టాయిలెట్స్‌కు నీటి వసతితో పాటు, శుభ్రం చేసే ఏర్పాటు చేయాలి. డోర్లు సరిగా లేకుంటే రిపేర్స్చేయించాలి. స్కూల్ఆవరణలో ఎక్కడా మురుగు నీరు నిల్వ ఉండకూడా చూడాలి. స్కూల్పరిసరాల్లో దోమల ఉత్పత్తికి దోహదపడే మురుగునీటి కుంటలుంటే పూడ్చేయించాలి. తరగతి గదులు, కారిడార్లు శుభ్రంగా ఉంచేలా చూడాలి. తడి, పొడి చెత్త వేసేందుకు వేర్వేరు డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలి.
పాఠశాలలో చెత్తా చెదారం, పరిసరాల్లో చెట్ల పొదలు ఉంటే తొలగింపజేయాలి. ఆయా పనులు చేసేందుకు స్కూల్ మేనేజ్మెంట్కింద మంజూరైన నిధులతో పాటు, పాత సామగ్రి అమ్మగా వచ్చిన డబ్బులను వాడుకోవచ్చు. ఈనెల 25 లోపు 5.0 క్లీన్అండ్సేఫ్ ప్రోగ్రామ్ లో నిర్దేశించిన పనులను పూర్తి చేసేలా రూపొందించిన ప్రణాళికను పక్కగా అమలు చేయాలని సమగ్ర శిక్ష స్టేట్‌ప్రాజెక్ట్ డైరెక్టర్డీఈఓలను ఆదేశించారు. దీంతో ఆయా జిల్లాల డీఈఓలు ప్రోగ్రామ్ అమలుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
స్వచ్ఛతకు, భద్రతకు ప్రాధాన్యం
ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు ఉచిత టెక్ట్స్, నోట్ బుక్స్, యూనిఫామ్స్అందిస్తుండడంతో పాటు మధ్యాహ్న భోజనం, అమ్మ ఆదర్శ పాఠశాల పథకాల కింద ఇప్పటికే మౌలిక వసతులు మెరుగుపరుస్తున్న విషయం తెలిసిందే. అయితే.. చాలా స్కూళ్ల ప్రాంగణాలు, ల్యాబ్‌లు, స్టోర్‌రూమ్ లు అధ్వానంగా ఉండడం, బిల్డింగ్లు శిథిలావస్థకు చేరి పైకప్పు పెచ్చులూడి పడుతుండడం వంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛతకు, విద్యార్థుల భద్రతకు పెద్దపీట వేయాలని సర్కార్ నిర్ణయించింది.
ఇందుకు విద్యాశాఖ 5.0 ప్రోగ్రామ్‌కు రూపకల్పన చేసింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వామ్యంతో అవసరమైన పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు మండల విద్యాధికారి, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్, స్కూల్ హెడ్ మాస్టర్, టీఎస్ఈడబ్ల్యూ ఐడీసీ ఏఈలతో కమిటీ ఏర్పాటవుతుంది. ఆ కమిటీ మండల పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లను ప్రత్యక్షంగా తనిఖీ చేస్తుంది. స్కూల్ స్థితిగతులను పరిశీలించి ఏయే పనులు చేయాలో నిర్ణయిస్తుంది.
