మేనమామ పెళ్లికొచ్చి చనిపోయాడు: నాలుగో అంతస్తు నుంచి పడి బాలుడు మృతి

మేనమామ పెళ్లికొచ్చి చనిపోయాడు: నాలుగో అంతస్తు నుంచి పడి బాలుడు మృతి

హైదరాబాద్: ఆ ఇంట్లో మొన్ననే పెళ్లి జరిగింది. ఇంకా చుట్టాలు, బంధువులతో ఇళ్లంతా సందడిగా ఉంది. ఇంతలో అనుకోని దుర్ఘటనతో పెళ్లింట్లో విషాదం అలుముకుంది. మేనమామ పెళ్ళికి అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలుడు అపార్ట్మెంట్ నాలుగో అంతస్తు నుంచి పడి మృతి చెందాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రం గౌతమి నగర్‎లోని అవినాష్ అపార్ట్‎మెంట్‎లో జరిగింది. 

వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన టీచర్ రాజశేఖర్ తన బావమరిది పెళ్లికి భార్యాపిల్లలతో కలిసి మంచిర్యాలలోని అత్తగారింటికి వచ్చాడు. ఇటీవలే పెళ్లి తంతు పూర్తి కాగా సోమవారం (నవంబర్ 3) ఒడిబియ్యం పోసుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆ సందడిలో మునిగిపోయారు. 

మరోవైపు రాజశేఖర్ కొడుకు సహర్ష్ (10) అపార్ట్మెంట్ నాలుగో అంతస్తుకు వెళ్లి ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అక్కడ నుంచి కింద పడ్డాడు. తీవ్ర గాయాలైన సహర్ష్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనతో పెళ్లి ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. సహర్ష్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తిరుపతి తెలిపారు.