ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు ముందడుగు.. 700 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ఆమోదం

ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు ముందడుగు.. 700 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ఆమోదం
  • జీవో జారీచేసిన ఆర్​అండ్​బీ శాఖ 

హైదరాబాద్, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లాలో ఎయిర్​పోర్ట్​ ఏర్పాటుకు కీలకమైన ముందడుగు పడింది. 700 ఎకరాల భూసేరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. ఈ మేరకు ఆర్​ అండ్​ బీ శాఖ తరపున స్పెషల్​ చీఫ్​ సెక్రటరీ వికాస్​రాజ్​ సోమవారం జీవో నంబర్ 73 పేరిట ఉత్తర్వులు జారీ చేశారు. 

ఆదిలాబాద్​ జిల్లా కలెక్టర్​ తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా.. రాష్ట్రంలోని ఆరు  ప్రాంతీయ విమానాశ్రయాల అభివృద్ధిని చేపట్టాలని 2018లో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ఆరు విమానాశ్రయాలకు టెక్నో ఎకనామిక్  ఫీజిబిలిటీ రిపోర్ట్స్  తయారీకి కన్సల్టెన్సీ సేవలను అందించడానికి ఎయిర్‌‌‌‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్  ఇండియా (ఏఏఐ)  కన్సల్టెంట్‌‌‌‌  సంస్థను నియమించింది. 

దీంతో ఏఏఐ ప్రతినిధులు ఆదిలాబాద్​ ఎయిర్​పోర్ట్​ ప్రాంతాన్ని పరిశీలించి కొన్ని అనుమతులకు లోబడి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఢిల్లీలోని ఎయిర్‌‌‌‌పోర్ట్  అథారిటీ చైర్మన్  నివేదించిన ఈ విషయాన్ని పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం.. ఆదిలాబాద్ జిల్లాలోని విమానాశ్రయం అభివృద్ధి కోసం 700 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలని అక్కడి జిల్లా కలెక్టర్‌‌‌‌ను ఆదేశించింది. 

ఉత్తర తెలంగాణకు ఎంతో మేలు: మంత్రి వెంకట్​రెడ్డి

ఆదిలాబాద్​ జిల్లాలో ఎయిర్ పోర్ట్​ ఏర్పాటు చేస్తే ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్ర ఆర్​ అండ్​ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదిలాబాద్  జిల్లాలో జాయింట్  యూజర్ ఎయిర్‌‌‌‌ఫీల్డ్  అభివృద్ధి కోసం మొత్తం 700 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు.