ఘోరం 19 మందిని కబళించిన కంకర టిప్పర్..అతి వేగంతో వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం

ఘోరం 19 మందిని కబళించిన కంకర టిప్పర్..అతి వేగంతో వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం
  • మృతుల్లో 13 మంది మహిళలు, 40 రోజుల పసికందు
  • 34 మందికి గాయాలు.. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో ఘటన
  • ఎడమ వైపు గుంతను తప్పించబోయి అదుపుతప్పిన టిప్పర్ 
  • ప్రమాదం ధాటికి బస్సు కుడివైపు భాగం నుజ్జునుజ్జు
  • క్షణాల్లో టిప్పర్‌‌లోని కంకరంతా బస్సులోకి డంప్​
  • అందులో కూరుకుపోయి పలువురు స్పాట్‌లోనే డెడ్‌
  • గంటల పాటు శ్రమించి సీట్లు, బస్సును 
  • కట్​చేసి బయటకు తీసిన పోలీసులు

హైదరాబాద్‌‌ / హైదరాబాద్ ​సిటీ, వెలుగు: కంకర టిప్పర్ ఓ చిన్నారి సహా19 మందిని బలి తీసుకుంది. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంకర లోడ్‌‌తో వస్తున్న టిప్పర్.. మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 17 మంది స్పాట్‌‌లోనే చనిపోగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో ట్రీట్‌‌మెంట్ పొందుతూ ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. 

మరో కుటుంబానికి చెందిన తండ్రి, కూతురు, మనుమరాలు చనిపోయారు. ఈ కుటుంబంలో తల్లితో పాటు ఆమె ఒడిలోనే 40 రోజుల పసికందు ప్రాణాలు విడిచిన దృశ్యం గుండెలను పిండేసింది. మూలమలుపు వద్ద అధిక వేగంగా వచ్చిన టిప్పర్ రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే క్రమంలో బస్సును ఢీకొట్టి, దాని కుడివైపు భాగాన్ని చీల్చుకుంటూ బస్సులోకి కంకరను కుమ్మరించింది. ఏం జరుగుతుందో తెలిసేలోపే కంకర కింద నలిగిపోయి 13 మంది మహిళలు, ఒక పసికందు సీట్లలో ఎక్కడివారక్కడే ప్రాణాలు విడిచారు. ప్రమాదం తర్వాత తల భాగం వరకు కంకరలో కూరుకుపోయిన ప్రయాణికులు సాయం కోసం పెట్టిన ఆర్తనాదాలు కంటతడి పెట్టించాయి. 

బస్సులో 72 మంది..  

తాండూరు డిపోకు చెందిన (టీఎస్‌‌ 34 టీఏ 6354) ఆర్టీసీ అద్దె బస్సు సోమవారం తెల్లవారుజామున 4:40 గంటలకు డిపో నుంచి బయలుదేరింది. తాండూరు బస్‌‌స్టేషన్‌‌లో 32 మందికి పైగా ప్రయాణికులు ఎక్కారు. డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దస్తగిరి బాబా (37), కండక్టర్ రాధతో కలిపి 34 మందితో 4:59 గంటలకు బస్సు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు బయలుదేరింది. ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్ సర్వీస్​కావడంతో మధ్యలో పలు స్టేషన్ల వద్ద ప్రయాణిలకు ఎక్కారు. అలా ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 72 మంది ఉన్నారు. 

తాండూరు నుంచి బయలుదేరిన బస్సు.. వికారాబాద్‌‌‌‌‌‌‌‌, చేవెళ్ల మీదుగా హైదరాబాద్ వస్తున్నది. సరిగ్గా ఉదయం 6:15 గంటల నుంచి 6:40 గంటల మధ్య చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ ఇందిరానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకుంది. అదే సమయంలో సంగారెడ్డిలోని క్రషర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కంకర లోడ్‌‌‌‌‌‌‌‌ వేసుకుని వస్తున్న హైడ్రాలిక్ టిప్పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. మీర్జాగూడ మీదుగా వికారాబాద్ నుంచి చిట్టంపల్లి వెళ్తున్నది.

 మహారాష్ట్రలోని నాందేడ్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఆకాశ్‌‌‌‌‌‌‌‌ దన్యా కామ్లే(24) అనే డ్రైవర్ టిప్పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అతివేగంగా నడుపుతూ వచ్చాడు. మీర్జాగూడ సమీపంలోని మూలమలుపు వద్దకు రాగానే రోడ్డు మీద ఎడమ వైపు ఉన్న గుంతను తప్పించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అదుపు తప్పిన టిప్పర్​కుడి వైపునకు దూసుకెళ్లి, ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. 

కంకరలో కూరుకుపోయి ఆర్తనాదాలు

నలుగురు మహిళలు తల, నడుము వరకు కంకరలో కూరుకుపోయి ఆర్తనాదాలు చేశారు. కండక్టర్ రాధ సహా బస్సులో ఎడమవైపు, వెనుకభాగంలో ఇరుక్కుపోయిన వారిలో18 మందిని స్థానికులు అతికష్టం మీద కాపాడారు. సమాచారం అందుకున్న చేవెళ్ల సీఐ భూపాల్‌‌‌‌‌‌‌‌ శ్రీధర్‌‌‌‌‌‌‌‌ సహా పోలీస్ సిబ్బంది స్పాట్‌‌‌‌‌‌‌‌కు చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. జేసీబీ సాయంతో బస్సు ఎడమపక్క భాగాన్ని పూర్తిగా తొలగించి కంకరలో కూరుకుపోయిన వారిని కాపాడారు. డెడ్‌‌‌‌‌‌‌‌బాడీలను వెలికితీశారు. సహాయక చర్యలు జరుగుతున్న సమయంలో సీఐ భూపాల్ శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలిపైకి జేసీబీ ఎక్కడంతో ఆయన ఎడమ కాలికి గాయమైంది. దీంతో దవాఖానకు తరలించారు.

బస్సు నుంచి బయటకు తీసిన వారిని చేవెళ్ల, వికారాబాద్‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని వివిధ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌కి తరలించారు. మృతదేహాలకు చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లోనే పోస్ట్‌‌‌‌‌‌‌‌మార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించారు. కండక్టర్ రాధ ఫిర్యాదు మేరకు చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ ఆకాశ్‌‌‌‌‌‌‌‌ను నిందితుడిగా చేర్చారు. ప్రమాదం జరిగిన సమయంలో టిప్పర్ ఓనర్ లక్ష్మణ్ కూడా ఉన్నట్లు గుర్తించారు. లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌కు కూడా గాయాలవడంతో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో చికిత్స అందిస్తున్నారు. 

34 మందికి గాయాలు  

బస్సు ప్రమాదంలో 34 మంది గాయపడ్డారు. వీరిలో 14 మందికి చేవెళ్లలోని పీఎంఆర్‌‌‌‌‌‌‌‌ దవాఖానలో, మిగతా 20 మందికి వికారాబాద్‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని పలు దవాఖానాల్లో చికిత్స అందజేస్తున్నారు. గాయపడిన వారిలో పూడూరుకు చెందిన అఖిల, మల్కాజిగిరికి చెందిన వెన్నెల, తాండూరుకు చెందిన మహ్మద్‌‌‌‌‌‌‌‌ మున్నిస్, వికారాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన రవి,  గంగుపల్లికి చెందిన అనసూయ, తాండూరుకు చెందిన రాధ (కండక్టర్), వికారాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన రాజు, వెంకటయ్య, ప్రేరణ, ధన్నారం తండాకు చెందిన బుజ్జిబాయి, హస్తాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సుజాత , దౌల్తాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన అశోక్‌‌‌‌‌‌‌‌ , యాలాకు చెందిన నవీన్, తాండూరుకు చెందిన శ్రీను, శ్రీసాయి, అక్రమ్, అస్లిమ్, ధారూరుకు చెందిన నందిని, కోకట్‌‌‌‌‌‌‌‌కు చెందిన బస్వరాజ్​ఉన్నారు. 

బస్సు, టిప్పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనా చలాన్లు.. 

బస్సు ప్రమాద ఘటనపై పోలీసులు ప్రాథమిక దర్యాప్తు మొదలు పెట్టారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ గతంలో రెండుసార్లు నిషేధిత టైంలో సిటీలోకి భారీ లోడ్‌‌‌‌‌‌‌‌తో ఎంట్రీ అయింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి, సెప్టెంబర్ నెలల్లో పోలీసులు రెండుసార్లు (రూ.3,270) ఫైన్ వేశారు. చందానగర్ పరిధిలో ఒకసారి, ఆర్సీపురం పరిధిలో మరోసారి ట్రాఫిక్ రూల్స్‌‌‌‌‌‌‌‌కు విరుద్ధంగా ఎంట్రీ కావడంతో చలాన్​వేశారు. ఈ టిప్పర్​ఉదిత్య అనిత పేరుతో రిజిస్టర్​అయింది. అలాగే ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సుపైన సిగ్నల్ జంప్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి మూడు చలాన్లు (రూ.2,305) ఉన్నాయి. కాగా, ఘటనా స్థలంలో సైబరాబాద్ సీపీ మహంతి మాట్లాడుతూ ఇద్దరు డ్రైవర్లు మృతి చెందడం వల్ల తప్పు ఎవరిదనేది? తక్షణమే నిర్ధారించడం కష్టమన్నారు. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. 

నుజ్జునుజ్జయిన బస్సు..కమ్మేసిన కంకర

50 టన్నులకు పైగా కంకర లోడ్‌‌‌‌‌‌‌‌తో అదుపు తప్పిన టిప్పర్.. అతి వేగంగా బస్సు డ్రైవర్ వైపు నుంచి వెనుక టైర్ల వరకు క్యాబిన్‌‌‌‌‌‌‌‌ను చీల్చుకుంటూ వెళ్లి, బస్సు మీదికి ఒరిగింది. టిప్పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పీడ్‌‌‌‌‌‌‌‌ ధాటికి బస్సు పైభాగం లేచిపోయింది. కుడి వైపు అంతా నుజ్జునుజ్జయింది. డ్రైవర్ సీటు సహా కుడి వైపు 9 వరుసల వరకు సీట్లు తునాతునకలయ్యాయి. ఈ క్రమంలోనే టిప్పర్ కుడివైపునకు లేచింది. దీంతో అందు‌‌‌‌‌‌‌‌లోని  కంకరంతా ఒక్కసారిగా బస్సు లోపల ప్యాసింజర్లపై కుప్పలా పడింది. 

ఒక్కసారిగా కంకర మీద పడడంతో బస్సు ముందు భాగంలోని 13 మంది మహిళలు నలిగిపోయారు. ఆయా సీట్లలో కూర్చుకున్న వారు కూర్చున్నట్లే ప్రాణాలు కోల్పోయారు. తల్లితో పాటు ఆమె ఒడిలోనే 40 రోజుల చిన్నారి ప్రాణాలు విడిచారు. బస్సు డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా మొత్తం 17 మంది ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. టిప్పర్ డ్రైవర్ ఆకాశ్‌‌‌‌‌‌‌‌ కూడా స్పాట్‌‌‌‌‌‌‌‌లో ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు చేవెళ్ల ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఫోరెన్సిక్ ల్యాబ్‌‌‌‌కు డ్రైవర్ల శాంపిల్స్

చేవెళ్ల ఘటనలో చనిపోయిన బస్సు డ్రైవర్, టిప్పర్​డ్రైవర్ డ్రంకెన్​ ​డ్రైవ్​చేశారా? లేదా? అన్నది తెలుసుకోవడానికి వారి విసరను(కడుపులో శాంపిల్) ను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపినట్లు చేవెళ్ల దవాఖాన సూపరింటెండెంట్​రాజేంద్రప్రసాద్​తెలిపారు. చనిపోయినవారిలో కొందరు కంకరలో కూరుకుపోయి ఊపిరాడక చనిపోయారని, వారి డెడ్​బాడీలను పరిశీలించినప్పుడు ముక్కు, నోర్లలో డస్ట్​, కంకర నిండిపోయి కనిపించిందన్నారు. 

చాలామంది తీవ్ర గాయాలతో, ఛాతికి బలమైన దెబ్బలు తాకడం వల్ల, తలభాగం తెగిపోయి చనిపోయారన్నారు. మృతదేహాలకు చేవెళ్ల దవాఖానలోనే పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించామన్నారు. కాగా..పోస్ట్​మార్టమ్​చేస్తున్నప్పుడు తమకు కన్నీళ్లు ఆగలేదని డాక్టర్లు ప్రసాద్​, శ్రీనివాస్​, సజా ఆవేదన వ్యక్తం చేశారు. చేవెళ్ల దవాఖానలో పని చేస్తున్న ఈ డాక్టర్లు 19 మంది మృతదేహాలకు పోస్ట్​మార్టం చేశారు. 

మృతుల వివరాలివీ..  మృతుల పేరు, వయసు    స్వస్థలం

1) సెలెహ(20)    కిషన్‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌, బహదూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పురా

2) జహీరా ఫాతిమా (40 రోజులు)    కిషన్‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌, బహదూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పురా

3) ఈడిగ నందిని(22)    పెర్కంపల్లి, వికారాబాద్‌‌‌‌‌‌‌‌

4) ఈడిగ అనూష(20)    పెర్కంపల్లి, వికారాబాద్‌‌‌‌‌‌‌‌ 

5) ఈడిగ సాయి ప్రియ(18)    పెర్కంపల్లి, వికారాబాద్‌‌‌‌‌‌‌‌

6) తరీఫ్ బాయి(44)    ధన్నరమ్‌‌‌‌‌‌‌‌ తండా, వికారాబాద్‌‌‌‌‌‌‌‌

7) గుర్రాల అఖిల(23)    లక్ష్మీనారాయణ పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,యాలాల్ వికారాబాద్‌‌‌‌‌‌‌‌

8) లక్ష్మి(40)    హజీపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,వికారాబాద్‌‌‌‌‌‌‌‌

9) కుదుగుంట బందెప్ప(42)    హాజీపూర్, వికారాబాద్‌‌‌‌‌‌‌‌

10) మగల్ల హన్మంతు(44)    నితూర్, వికారాబాద్‌‌‌‌‌‌‌‌

11) ముస్కాన్ బేగం(21)    గౌతపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తాండూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

12) ఎండీ ఖలీద్(43)    ఇంద్రనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తాండూరు

13) తబస్సుమ్ ఝహాన్‌‌‌‌‌‌‌‌(38)    ముర్షద్‌‌‌‌‌‌‌‌ ధర్గా, తాండూరు

14) కిస్టపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటమ్మ(21)    వాల్మీకి నగర్, తాండూరు

15) కల్పన (42)    కార్మికనగర్‌‌‌‌‌‌‌‌, బోరబండ‌‌‌‌‌‌‌‌

16) గుణ్ణమ్మ(60)    కార్మికనగర్‌‌‌‌‌‌‌‌, బోరబండ‌‌‌‌‌‌‌‌

17) నాగమణి(54)    గుల్బర్గ, కర్నాటక

18) దస్తగిరిబాబా(45)    మంథటి, వికారాబాద్​(ఆర్టీసీ బస్సు డ్రైవర్)

19) ఆకాశ్ దన్యా కాంబ్లే (24)    నాందేడ్, మహారాష్ట్ర (టిప్పర్ డ్రైవర్)