నల్గొండ, వెలుగు : బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ పై పోక్సో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే... నల్గొండ పట్టణంలో ఈ నెల 14న ఓ బాలిక సైకిల్ పై వెళ్తోంది. ఇదే సమయంలో ఓ వ్యక్తి మాస్క్ పెట్టుకొని బైక్ పై వచ్చి బాలికను అడ్డగించి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా.. వారు నల్గొండ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా.. బాలికను అడ్డగించింది గుర్రంపోడు పీఎస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సత్యనారాయణగా తేలింది. దీంతో ఈ నెల 17న అతడిని అదుపులోకి తీసుకొని సోమవారం కోర్టులో హాజరుపరిచారు. కానిస్టేబుల్ గతంలో సైతం మహిళలు, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఇతడిపై నల్గొండ టూ టౌన్ పీఎస్ పరిధిలో సైతం పోక్సో కేసు నమోదు కావడంతో కానిస్టేబుల్ సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఎస్పీ శరత్ చంద్రపవార్ ఉత్తర్వులు జారీ చేశారు.
బాలికపై లైంగిక దాడి
అశ్వారావుపేట, వెలుగు : బాలికపై లైంగిక దాడికి చేసిన యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. ఈ ఘటన భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలంలో జరిగింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక బంధువు అశ్వారావుపేట గవర్నమెంట్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటుండడంతో చూసేందుకు హాస్పిటల్ కు వెళ్లింది.
కొద్ది సేపటి తర్వాత బాలిక సమీప బంధువైన మామిళ్లవారిగూడెం గ్రామానికి చెందిన కొరస సంతోష్ ఇంటి వద్ద దింపుతానని బాలికను బైక్ పై ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్లాక బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాలికలను తన అన్న ఇంటి వద్ద దింపి వెళ్లిపోయాడు. బాలిక ఏడుస్తుండడంతో గమనించిన కుటుంబసభ్యులు ప్రశ్నించగా జరిగిన విషయాన్ని వివరించింది. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
