బ్యాంక్‌లకు పోటీగా పోస్ట్ ఆఫీస్‌ సేవింగ్స్‌ రాబడి

బ్యాంక్‌లకు పోటీగా  పోస్ట్ ఆఫీస్‌ సేవింగ్స్‌ రాబడి

న్యూఢిల్లీ: సేవింగ్స్‌‌‌‌ కోసం ఒకప్పుడు బ్యాంకుల వైపు చూసిన ప్రజలు ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్‌‌ల వైపు కూడా ఆకర్షితులవుతున్నారు.  పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్‌‌లు కూడా బ్యాంకుల ఎఫ్‌‌డీలతో పోటీ పడి వడ్డీని ఆఫర్ చేస్తుండడమే ఇందుకు కారణం. సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్‌‌ వంటి స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌‌లపై ఇస్తున్న వడ్డీని  ప్రభుత్వం వరుస మీటింగ్‌‌లలో  పెంచింది.  ఫలితంగా ఎక్కువ రిటర్న్ వస్తుండడంతో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్  స్కీమ్‌‌లు డిపాజిటర్లను ఆకర్షిస్తున్నాయి.   కాగా, పోస్ట్‌‌ ఆఫీస్‌‌లలో  స్మాల్ సేవింగ్స్  స్కీమ్స్‌‌ కింద డిపాజిట్ చేయొచ్చన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం  రెండేళ్ల కాల పరిమితి గల పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ డిపాజిట్లు 6.9 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుండగా, ఇదే కాల పరిమితిగల ఎఫ్‌‌డీలపై  బ్యాంకులు ఇంచుమించు ఇంతే రిటర్న్‌‌ను ఇస్తున్నాయి. 

బెంచ్‌‌మార్క్‌‌ రేటయిన రెపోను ఆర్‌‌‌‌బీఐ గత 11 నెలల్లో 2.5 శాతం పెంచిన విషయం తెలిసిందే. ఫలితంగా డిపాజిట్లపై ఇస్తున్న రేట్లను కూడా బ్యాంకులు, ప్రభుత్వం పెంచుతున్నాయి. ఫ్రెష్ డిపాజిట్ల (రిటైల్‌‌, బల్క్‌‌) పై ఇస్తున్న వెయిటెడ్‌‌ యావరేజ్‌‌ డొమెస్టిక్‌‌ టర్మ్‌‌ డిపాజిట్‌‌ రేటు (డబ్ల్యూఏడీటీడీఆర్‌‌‌‌) కిందటేడాది మే నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య 2.22 శాతం పెరిగింది. ఆర్‌‌‌‌బీఐ డేటా ప్రకారం, 2022–23 ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో పెద్ద మొత్తంలో డిపాజిట్లను ఆకర్షించడంపై  బ్యాంకులు ఎక్కువ ఫోకస్ పెట్టాయి.  చివరి ఆరు నెలల్లో మాత్రం బల్క్ డిపాజిట్ల ( 77 బేసిస్ పాయింట్లు) పై కంటే రిటైల్ డిపాజిట్లపై ఇస్తున్న రేటును (122   బేసిస్ పాయింట్లు)  ఎక్కువగా పెంచాయని అధికారులు తెలిపారు. 

స్మాల్‌‌ సేవింగ్స్‌‌పై..

సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్‌‌ వంటి స్మాల్ సేవింగ్స్‌‌ స్కీమ్‌‌లపై  ఇస్తున్న వడ్డీ రేటును కిందటేడాది డిసెంబర్‌‌‌‌తో ముగిసిన  క్వార్టర్‌‌‌‌లో ప్రభుత్వం 10–30 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య 20 నుంచి 110 బేసిస్ పాయింట్లు పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని క్యూ1 (ఏప్రిల్‌‌–జూన్‌‌) కోసం మరో 10–70 బేసిస్ పాయింట్లు  పెంచింది.  స్మాల్‌‌ సేవింగ్స్ స్కీమ్‌‌ల వడ్డీ రేట్లను  2020–21 లోని సెకెండ్ క్వార్టర్‌‌‌‌ నుంచి 2022–23 లోని సెకెండ్ క్వార్టర్‌‌‌‌ వరకు అంటే తొమ్మిది క్వార్టర్ల పాటు ప్రభుత్వం మార్చలేదు.  

రేట్లు ఇలా పెరుగుతూ..

 ‘ పోస్ట్ ఆఫీస్‌‌‌‌ టర్మ్‌‌ డిపాజిట్ల రేట్లు బ్యాంక్‌‌ల టర్మ్‌‌ డిపాజిట్ల రేట్లతో పోటీపడుతున్నాయి’ అని ఆర్‌‌‌‌బీఐ పేర్కొంది. 1-2 ఏళ్ల కాల పరిమితి గల  రిటైల్ డిపాజిట్లపై బ్యాంకులిస్తున్న యావరేజ్ వడ్డీ రేటు  ఈ ఏడాది ఫిబ్రవరిలో 6.9 శాతానికి పెరిగిందని వివరించింది. కిందటేడాది సెప్టెంబర్ నాటికి ఇది 5.8 శాతంగా ఉందని, అదే మార్చి, 2022 నాటికి 5.2 శాతంగా రికార్డయ్యిందని వెల్లడించింది. వరుసగా మూడు క్వార్టర్లలో స్మాల్ సేవింగ్స్ స్కీమ్ రేట్లను ప్రభుత్వం పెంచింది. దీంతో రెండేళ్ల కాల పరిమితి గల పోస్ట్ ఆఫీస్‌‌ టర్మ్‌‌ డిపాజిట్‌‌(పీఓటీడీ)  రేటు కిందటేడాది సెప్టెంబర్ నాటికి 5.5 శాతం ఉండగా,  ప్రస్తుతం 6.9 శాతానికి పెరిగింది. మూడేళ్ల కాల పరిమితి గల సేవింగ్స్ డిపాజిట్లపై ఇస్తున్న వడ్డీ 5.5 శాతం నుంచి 7 శాతానికి పెరిగింది.  దేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్‌‌బీఐ   ఏడాది నుంచి రెండేండ్ల కాలపరిమితి గల ఎఫ్‌‌డీలపై 6.8 శాతం వడ్డీ ఇస్తోంది.  రెండు నుంచి మూడేళ్ల కాల పరిమితి గత ఎఫ్‌‌డీలపై 7 శాతం ఆఫర్ చేస్తోంది.