టీఎస్పీఎస్సీ ఆఫీసును ముట్టడించిన అభ్యర్థులు
బషీర్ బాగ్, వెలుగు: వచ్చే నెల 29 , 30 తేదీల్లో జరుగనున్న గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. సోమవారం పెద్ద ఎత్తున తరలివచ్చి హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ముట్టడించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో.. కమిషన్ కార్యాలయం పక్కనే బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆగస్టు నెల ఒకటో తేదీ నుంచి 23 వరకు గురుకుల బోర్డుకు సంబంధించిన పరీక్షల తేదీలను ప్రకటించారని తెలిపారు. ఒకే నెలలో అటు గ్రూప్ 2, ఇటు గురుకుల పరీక్షల నిర్వహణ వల్ల అభ్యర్థులు ఏదో ఒక పరీక్షకు మాత్రమే ప్రిపేర్ అవ్వాల్సిన గత్యంతరం ఏర్పడ్డదని ఆందోళన వ్యక్తం చేశారు. దానివల్ల తాము నష్టపోతామని పేర్కొన్నారు. అంతేకాక గ్రూప్ 2 పరీక్షలోని మూడో పేపర్ ఎకానమీలో గతంలోని సిలబస్ కు అదనంగా 70 శాతం కలిపారని అన్నారు. పేపర్ లీకేజ్ ఘటనలతో తాము 3 నెలలు చదవలేకపోయామని, ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని గ్రూప్ 2 పరీక్షను మూడు నెలలు వాయిదా వేయాలని వారు కోరారు. మానవతా దృక్పథంతో తమ సమస్యను అర్థం చేసుకుని, తగిన వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం అభ్యర్థులు టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రటరీలతో భేటీ అయ్యి, వారి సమస్యను వివరించారు. ఈ అంశంపై తాము త్వరలో సమావేశమై రీషెడ్యూల్ ప్రకటిస్తామని వారు హామీ ఇచ్చినట్లు అభ్యర్థులు తెలిపారు.

