చాయ్‌వాలాగా ప్రపంచ కరాటే ఛాంపియన్‌

చాయ్‌వాలాగా ప్రపంచ కరాటే ఛాంపియన్‌

దేశం గర్వించదగ్గ పతకాలను అందించాడు. పాతికేళ్ల వయసు నిండక ముందే 60కి పైగా పతకాలు సాధించాడు. కరాటేలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. అయితే పూట గడవక పస్తుండాల్సి వస్తోంది. దీంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు చాయ్‌వాలా అవతారమెత్తాడు ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన హరిఓమ్ శుక్లా. ప్రస్తుతం మథురలో రోడ్డు పక్కన టీ అమ్ముతూ  బతుకు బండి లాగిస్తున్నాడు.

ఆరేళ్ల వయస్సు నుంచే హరిఓమ్ శుక్లా కరాటేలో నేర్చుకున్నాడు. 2013లో థాయ్‌లాండ్‌లో జరిగిన జూడో కరాటే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత్‌ తరఫున గోల్డ్ మెడల్ ను సాధించి పెట్టాడు. అయితే, ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందకపోవడంతో అతని ఆర్ధిక కష్టాలు మొదలయ్యాయి. టోర్నీల్లో గెలుచుకున్న ప్రైజ్ మనీ కూడా అయిపోయింది. దీంతో కుటుంబ భారంతో ఉద్యోగం కోసం ప్రభుత్వానికి ఎన్ని సార్లు మొర పెట్టుకున్న ఫలితం లేకపోయింది. రోజు రోజుకూ కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కొన్ని రోజుల పాటు పాఠశాల విద్యార్థులకు కరాటే పాఠాలు నేర్పించాడు. కరోనా కారణంగా స్కూళ్లు మూతపడటంతో.. మథురలో టీ స్టాల్‌ను ప్రారంభించాడు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా.. ఆ సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా తన దగ్గర డబ్బు లేదని తెలిపాడు హరిఓమ్ శుక్లా. ఆ సర్టిఫికేట్ ఉంటే ఏదైనా ఉద్యోగం చూసుకునే వాడినన్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి క్రీడాకారుల కోటాలో తనకు ఉద్యోగం ఇప్పించాలని వేడుకుంటున్నాడు.