బషీర్ బాగ్, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో మహిళల సమస్యలపై పోరాటాలు చేస్తున్న ప్రొగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఆఫ్ విమెన్(పీవోడబ్ల్యూ) అర్ద శతాబ్ది వేడుకలను సక్సెస్ చేయాలని పీవోడబ్ల్యూ ప్రెసిడెంట్, అర్ద శతాబ్ది సమన్వయ కమిటీ సభ్యురాలు సంధ్య పిలుపునిచ్చారు. హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో నిర్వహించిన సమావేశంలో వార్షికోత్సవాలకు సంబంధించిన బ్రోచర్ ను ఆమె రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సంధ్య మాట్లాడుతూ..1974లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినిలతో ఏర్పడిన పీవోడబ్ల్యూ నాలుగు దశాబ్దాలుగా మహిళల సమస్యలపై పోరాటం చేస్తోందన్నారు.
జెండర్ వివక్ష , హక్కుల అణచివేత, ఆధిపత్య సంస్కృతికి వ్యతిరేకంగా , ఆర్థిక విధానాలను ప్రశ్నిస్తూ ఉద్యమాలను నిర్మిస్తున్నట్లు ఆమె తెలిపారు. విద్య , ఉద్యోగ , చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటాలు చేశామని గుర్తు చేశారు. వచ్చే ఏడాది జూన్ 22న పీవోడబ్ల్యూ అర్ద శతాబ్ది వార్షికోత్సవాన్ని నిర్వహించనున్నామని.. ఇందులో భాగంగా ఈ నెల 19న సన్నాహక సదస్సు ఉంటుందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు విమలక్క, అంబిక, అనసూయ తదితరులు పాల్గొన్నారు.