వరంగల్‍ జడ్పీలో.. కరెంట్‍ లొల్లి

వరంగల్‍ జడ్పీలో.. కరెంట్‍ లొల్లి

24 గంటల కరెంట్‍, 200 యూనిట్లు ఎట్లిస్తారో చెప్పాలన్న బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌
ప్రభుత్వం ఏర్పడి 24 గంటలు గడవకముందే తొందర ఎందుకన్న కాంగ్రెస్‌‌‌‌
బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం
అర్థంతరంగా సమావేశాన్ని వాయిదా వేసిన జడ్పీ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ గండ్ర జ్యోతి

వరంగల్‍, వెలుగు : నిరంతర విద్యుత్‌‌‌‌, 200 యూనిట్లు ఫ్రీ కరెంట్‌‌‌‌ ఎట్లిస్తరో చెప్పాలని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ డిమాండ్‌‌‌‌, ప్రభుత్వం ఏర్పడి 24 గంటలు గడవకముందే తొందర ఎందుకున్న కాంగ్రెస్‌‌‌‌ సమాధానంతో వరంగల్‌‌‌‌ రూరల్‌‌‌‌ జడ్పీ మీటింగ్‌‌‌‌ గరంగరంగా సాగింది. కరెంట్‌‌‌‌ అంశంపై బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో సమావేశాన్ని జడ్పీ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ గండ్ర జ్యోతి అర్ధంతరంగా వాయిదా వేశారు.

మీటింగ్‌‌‌‌ ప్రారంభం కాగానే విద్య, వైద్యం, వ్యవసాయంపై చర్చ జరిగింది. అనంతరం బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ దుగ్గొండి మండల జడ్పీటీసీ ఆకుల శ్రీనివాస్‌‌‌‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం 24 గంటల కరెంట్‍, ఇంటింటికీ 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్‌‌‌‌ ఎలా ఇస్తారో చెప్పాలని, దీనికి సంబంధించిన గైడ్‍లైన్స్‌‌‌‌ చూపాలని డిమాండ్‌‌‌‌ చేశారు. దీంతో ఇటీవలే బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను వీడి కాంగ్రెస్‍లో చేరిన పర్వతగిరి జడ్పీటీసీ సింగ్‌‌‌‌లాల్‌‌‌‌ కల్పించుకొని తమ ప్రభుత్వం బాధ్యతలు తీసుకుని 24 గంటలు కూడా గడవలేదని, అప్పుడే తొందర ఎందుకని ప్రశ్నించారు. ‘ఎమ్మెల్యేలు కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు, అసెంబ్లీ సమావేశం కూడా జరగకముందే అనుమానం ఎందుకు’ అని అనడంతో ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది.

ఇదే టైంలో కాంగ్రెస్‍ సభ్యులు సర్పంచ్‌‌‌‌లు, రైతుల ప్రస్తావన తీసుకొచ్చారు. కేసీఆర్‍ సర్కార్‌‌‌‌ బిల్లులు ఇవ్వకపోవడంతో సర్పంచ్‌‌‌‌లు, రుణమాఫీ, పంట నష్టం మంజూరు చేయకపోవడంతో అప్పులపాలై రైతులు ఆత్మహత్య చేసుకున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇదే విషయంపై ఇరుపార్టీల సభ్యులు వాగ్వాదానికి దిగడంతో జడ్పీ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ జ్యోతి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

ప్రజలు గెలిపించిన ప్రభుత్వానికి స్వాగతం పలుకుతున్నామని, గ్యారంటీలను 100 రోజుల్లో నిలబెట్టుకోవాలని చెబుతూ సభ్యులను వారించారు. అయినా ఇరు పార్టీల సభ్యులు తగ్గకపోవడంతో సమావేశాన్ని అర్ధంతరంగా వాయిదా వేశారు. అయితే ఎజెండాలోని అంశాలను చర్చించకుండా సమావేశాన్ని వాయిదా వేయడం ఏంటని సభ్యులు కింద కూర్చొని నిరసన తెలిపారు. కాగా ప్రమాణస్వీకారం చేయకపోవడంతో కొత్త ఎమ్మెల్యేలు ఎవరూ సమావేశానికి హాజరుకాలేదు. అలాగే ఎంపీలు, ఎమ్మెల్సీ, కలెక్టర్‌‌‌‌ సైతం జడ్పీ మీటింగ్‌‌‌‌కు రాలేదు. జడ్పీ సీఈవో రామిరెడ్డి పాల్గొన్నారు.