
ఒక దేశ అభివృద్ధికి సూచిక, ప్రగతికి కొలమానం తలసరి విద్యుత్ వినియోగం అనే విషయం అందరికీ తెలిసిందే. విద్యుత్ సంస్కరణలు అమల్లోకి వచ్చి దాదాపు మూడు దశాబ్దాలు కావస్తోంది. రాష్ట్ర ప్రగతిలో డిస్కంల పాత్ర కీలకం. జాతీయ స్థాయిలో తెలంగాణ డిస్కంలు ఎన్నో ప్రశంసలు, స్కోచ్ అవార్డులు పొందుతున్నాయి. రాష్ట్రంలో దాదాపు 1.85 కోట్ల వినియోగదారుల్లో, రైతాంగానికి సుమారు 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24x7 ఉచిత విద్యుత్ మొదలుకొని... గృహజ్యోతి పథకం ద్వారా గృహ వినియోగదారులకు నెలకు 200 యూనిట్లు, సెలూన్లు, లాండ్రీలు, దోభీఘాట్ లకు నెలకు 250 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా, చిన్న తరహా పరిశ్రమలకు సబ్సిడీ టారిఫ్ పై విద్యుత్ సరఫరా చేస్తూ లక్షలాది పేదల ఆర్థిక స్వావలంబనకు డిస్కంలు చేయూతనిస్తున్నాయి.
వీటన్నిటికీ క్రాస్ సబ్సిడీ రూపేణా రాష్ట్ర ప్రభుత్వం ఏటా వేలకోట్ల రూపాయలు డిస్కంలకు అందిస్తున్నాయి. కానీ, నేడు డిస్కంలు నిలదొక్కుకోవడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. ఒకవిధంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నమాట వాస్తవం. నెట్‌వర్క్ బలోపేతానికి తీసుకున్న అప్పులు, వాటిపై వడ్డీలు తడిసి మోపెడై దానికి తోడు వ్యవస్థాగత అసమర్థతలు పంపిణీ సంస్థలను సంక్షోభంలోకి నెట్టాయి. నేటి మార్కెట్లో పోటీతత్వం, ప్రతికూల సమీకరణాలు, ఆర్థిక ఒడిదుడుకులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో కార్పొరేట్లకే ముచ్చెమటలు పడుతుండగా, లాభాపేక్ష లేకుండా కేవలం వినియోగదారుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగ విద్యుత్ పంపిణీ సంస్థల మనుగడ నిజంగా కత్తి మీద సామే అనడంలో సందేహం లేదు.
మరి ఈ సమస్యలు అధిగమించడానికి, డిస్కంలు మరో 50 ఏండ్లు మనుగడ సాధించడానికి ప్రజాసంక్షేమంలో ప్రభుత్వాలతో కలసి ముందడుగు వేయాలంటే కొన్ని కఠినమైన సంస్కరణలు అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. లైన్ నష్టాలు: సాంకేతిక, వాణిజ్య నష్టాలు జాతీయ ప్రమాణాల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆధునిక నెట్‌వర్క్, సమర్థవంతమైన ట్రాన్స్‌ఫార్మర్లు, స్మార్ట్ మీటర్లతో పంపిణీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం చాలా అవసరం.
ఫీడర్ వారీగా జవాబుదారీతనం, ఆటోమేటెడ్ మీటర్ రీడింగ్ (ఏఎంఆర్) ఆదాయ లీకేజీలను అరికడుతుంది. 30 లక్షల వ్యవసాయ పంప్ సెట్లకు ప్రతి ఒక్కంటికి ఎల్.టి. కెపాసిటర్ ఏడాదిలోగా బిగించడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి 20% విద్యుత్ ఆదా చేయడం ద్వారా ఏటా రూ.2 వేల కోట్ల విలువైన విద్యుత్ వృథా అరికట్టాలి.
- మానవ వనరులు: పరివర్తనలో మానవశక్తి, శ్రామికశక్తి, నైపుణ్య అంతరాలతో, మానవ మూలధనం ఒక ప్రధాన సవాలు. ఎస్సీఏడీఏ, జీఐఎస్, ఏఐ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలలో క్రమం తప్పకుండా శిక్షణ ఇవ్వడం, పారదర్శక నియామకాలతోపాటు, సామర్థ్యాన్ని పెంచుతుంది.
- అంతర్గత సామర్థ్యం పెంచుకోవడం: నాలుగేళ్ల క్రితం రాష్ట్రంలో ఉన్న రెండు డిస్కంల పరిధిలో అంతర్గత సామర్థ్యం పెంచుకోవడం ద్వారా సుమారు రూ.1600 కోట్ల అదనపు రెవెన్యూ సాధించాలని లక్ష్యం నిర్దేశించగా నేటి వరకు సగం కూడా పూర్తి కాలేదు. క్షేత్రస్థాయిలో డిస్కంలకు రావాల్సిన ప్రతి పైసా ఖచ్చితంగా సాధించడానికి ప్రతి ఉద్యోగి తమ శక్తిసామర్థ్యాలను ధారపోయాలి. వారిని కార్యోన్ముఖులను చేయడానికి పై అధికారులు సంప్రదాయ విధానాలకు స్వస్తి చెప్పి వినూత్న పంథాలో ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేయాలి.
- ఉచిత విద్యుత్ విధానం: ఇదొక ఖరీదైన నిబద్ధత. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ రైతులకు జీవనాడి కానీ డిస్కంలకు భారం. సకాలంలో ప్రభుత్వ పరిహారం, పీఎం- కుసుమ్ కింద సౌర పంపు-సెట్‌లను ప్రోత్సహించడం ద్వారా గ్రిడ్ విద్యుత్‌పై ఒత్తిడిని తగ్గించగలదు.
- ప్రభుత్వ క్రాస్-సబ్సిడీ: వ్యవసాయానికి సబ్సిడీ ఇవ్వడానికి పారిశ్రామిక, వాణిజ్య వినియోగ దారులపై అధికంగా ఆధారపడటం పోటీతత్వాన్ని దెబ్బతీసింది. సుంకాలను హేతుబద్ధీకరించడం, రాష్ట్ర మద్దతు ద్వారా సబ్సిడీ అంతరాలను తగ్గించడం చాలా ముఖ్యం.
- నెట్‌వర్క్ బలోపేతం: గ్రిడ్‌ను ఆధునీకరించడం, ఓవర్‌లోడ్ చేసిన ఫీడర్లు, పాత మౌలిక సదుపాయాలు తరచుగా విచ్ఛిన్నాలకు కారణమవుతాయి. నగరాల్లో భూగర్భ కేబులింగ్, గ్రామాల్లో హెచ్‌వీడీఎస్, ఆర్డీఎస్ఎస్, ఐపీడీఎస్ వంటి కేంద్ర పథకాల నుంచి వచ్చే నిధులు నెట్‌వర్క్‌ను ఆధునీకరించగలవు.
- పారదర్శక సేవలు: వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకోవడం, బిల్లింగ్ వివాదాలు, పేలవమైన ఫిర్యాదుల పరిష్కారం వినియోగదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను బలోపేతం చేయడం, సమయానుకూల ఫిర్యాదు పరిష్కారాన్ని నిర్ధారించడం, ఫీడర్ వారీగా పనితీరు నివేదికలను ప్రచురించడం పారదర్శకతను మెరుగుపరుస్తాయి.
- రుణ భారాలను తగ్గించడం: భారీ రుణాలు, పెరుగుతున్న వడ్డీ ఖర్చులు డిస్కంలను చిక్కుల్లో పడేశాయి. రుణ పునర్నిర్మాణం, వర్కింగ్ క్యాపిటల్‌పై కఠినమైన నియంత్రణ, గ్రీన్ బాండ్ల వంటి వినూత్న ఫైనాన్సింగ్ చర్యలు ఉపశమనం కలిగించగలవు.
- పని సంస్కృతి: ఉద్యోగుల్లో జవాబుదారీతనం, పనితీరుపై వారికి ప్రోత్సాహకాలు, జట్టు-ఆధారిత లక్ష్యాలు, వినూత్న క్షేత్ర పద్ధతులకు గుర్తింపు, అట్టడుగు స్థాయిలో బాధ్యత, సామర్థ్యాన్ని పెంపొందించగలవు.
- విద్యుత్ దొంగతనం: ఇదొక రుగ్మత. ట్యాంపర్ హెచ్చరికలు, బలమైన ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్‌లు, కమ్యూనిటీ అవగాహన ప్రచారాలతో కూడిన స్మార్ట్ మీటర్లు ఈ ముప్పును ఎదుర్కోవడంలో కీలకం.
- లీకేజీలను ప్లగింగ్ చేయడం: ప్రతి రూపాయి లెక్కించాలి. ఇప్పటికే అమల్లో ఉన్న ఇ–-టెండరింగ్, మూడవ పార్టీ ఆడిట్‌లు, వినియోగదారుల రికార్డుల డిజిటలైజేషన్ సేకరణ, బిల్లింగ్‌లో అసమర్థతలను తొలగించడంలో సహాయపడతాయి.
- అవినీతి ప్రక్షాళన: జీతాలు పెద్ద మొత్తంలో ఉన్నా కూడా లంచాలకు అలవాటుపడ్డ కొద్దిమంది అవినీతి వల్ల డిస్కంల పేరు ప్రఖ్యాతి మసకబారుతున్నది. అవినీతి తిమింగలాలను గుర్తించి కఠినంగా శిక్షించి సర్వీసు నుంచి తొలగించాలి. నిత్య పర్యవేక్షణ ఉండాలి. అప్పుడే సంస్థ పట్ల ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది.
- అనవసర ఖర్చులు తగ్గించడం: కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లను అరికట్టడం, వాహనాల వాడకంలో దుబారా అదుపుచేయడం, అవసరమున్న సామగ్రి మాత్రమే కొనుగోళ్లు జరపడం, నాణ్యత పాటించడం వల్ల సంస్థపై ఆర్థికభారం తగ్గుతుంది.
ముందుకు సాగే మార్గం
ఉద్యోగుల జీతభత్యాలకు, రిటైర్ అవుతున్న ఉద్యోగులకు చెల్లించాల్సిన టెర్మినల్ బెనిఫిట్స్, పెన్షన్లు, గుత్తేదార్లకు చెల్లించాల్సిన మొత్తాలు, నిర్వహణ ఖర్చులు తదితర అవసరాలకు నెలవారీగా పెద్ద మొత్తంలో నిధులు అవసరం అవుతున్నాయి. వాటి సమీకరణకు ప్రతి ఉద్యోగి తమ పరిధిలో రాబట్టవల్సిన ప్రతి రూపాయి నిబద్ధతతో, జవాబుదారీతనంతో పనిచేసి సమీకరించాలి. సంస్థ నాది, దీని మనుగడ బాధ్యత నాదే అనే గొప్ప భావన ప్రతి ఉద్యోగి హృదయాల్లో నిరంతరం రగులుతూ ఉండాలి. అప్పుడే నిధులు నిలువ ఉండే అవకాశం ఉంటుంది.
అప్పుకోసం బ్యాంకుల వైపు చూడాల్సిన అవసరం రాదు. తెలంగాణ డిస్కంల పునరుద్ధరణకు బలమైన రాజకీయ సంకల్పం, సాహసోపేతమైన నిర్వహణ సంస్కరణలు అవసరం. సకాలంలో సబ్సిడీ చెల్లింపులు, నష్టాలను తగ్గించడం, సాంకేతిక మెరుగుదల, జవాబుదారీతనంతో నడిచే పని సంస్కృతి అనేవి చర్చించలేనివి. విద్యుత్ రంగం అభివృద్ధికి
వెన్నెముక. డిస్కంల ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడం కేవలం విద్యుత్ సరఫరా గురించి మాత్రమే కాదు, ఇది తెలంగాణ భవిష్యత్తు వృద్ధిపథాన్ని కాపాడటం గురించి మాత్రమే అని ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అప్పుడే డిస్కం లు పచ్చగా, ప్రభుత్వాలు ప్రశాంతంగా ముందుకు సాగుతాయి.
దురిశెట్టి మనోహర్,
విశ్రాంత ఏడీఈ