డిసెంబర్ 29న మేడిగడ్డ దగ్గర పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్

డిసెంబర్ 29న మేడిగడ్డ దగ్గర పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్
  • కాళేశ్వరం, దాని బ్యారేజీల పరిస్థితిని 
  • వివరించనున్న మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి
  • పర్యటనలో మంత్రి శ్రీధర్​ బాబు, 
  • బ్యారేజీలు కట్టిన సంస్థల ప్రతినిధులు కూడా

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజీ మేడిగడ్డను ఈ నెల 29న రాష్ట్ర ఇరిగేషన్​శాఖ మంత్రి ఉత్తమ్ ​కుమార్​ రెడ్డి, ఐటీ ఇండస్ట్రీస్​ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు పరిశీలించనున్నారు. అదే రోజు అక్కడే.. కాళేశ్వరం ప్రాజెక్టు, డాక్టర్​ బీఆర్ ​అంబేద్కర్ ప్రాణహిత – చేవెళ్ల లిఫ్ట్​ఇరిగేషన్​స్కీంలపై మంత్రి ఉత్తమ్​ పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ఇవ్వనున్నారు. ప్రాణహితను కాళేశ్వరం ప్రాజెక్టుగా రీ డిజైన్​ చేయడంతో కలిగిన లాభనష్టాలు.. పెరిగిన వ్యయం.. పెరిగిన భూసేకరణ భారం.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో తలెత్తిన సమస్యలు, వాటికి పరిష్కారాలను ప్రజెంటేషన్​లో వివరించనున్నారు.

ఈ నెల 29న ఉదయం 9 గంటలకు హైదరాబాద్​నుంచి ఇద్దరు మంత్రులు హెలికాప్టర్​లో మేడిగడ్డకు బయల్దేరుతారు. మొదట.. కుంగిన మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్​ను పరిశీలిస్తారు. అక్కడే బ్యారేజీ పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు చేపట్టాల్సి ఉంది, నీటిని మళ్లించేందుకు ఎల్​అండ్​టీ సంస్థ చేపట్టిన మట్టికట్ట పనులు, అక్కడ చేపట్టాల్సిన ఇన్వెస్టిగేషన్స్​తదితర అంశాలను తెలుసుకుంటారు. ఏడో బ్లాక్​లోని పిల్లర్​కుంగిన ప్రభావం ఎంత మేరకు పడింది, మిగతా బ్లాకుల పరిస్థితి ఏమిటీ అనే వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత బ్యారేజీ వద్దనే పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ను మంత్రి ఉత్తమ్​ ఇస్తారు. రాష్ట్రంలోని ఇరిగేషన్​ప్రాజెక్టులపై అధికారులు, ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అన్నారం బ్యారేజీని పరిశీలించి.. బుంగలు ఏర్పడిన బ్లాకుల వద్ద పరిస్థితిని తెలుసుకుంటారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు నిర్మించిన కాంట్రాక్టర్లు, సబ్​కాంట్రాక్టర్లు, నిర్మాణంతో సంబంధం ఉన్న అందరికీ సమాచారం ఇచ్చి వారంతా  మంత్రుల పర్యటనలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్​ఈఎన్సీ (జనరల్) మురళీధర్​ను మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి సోమవారం ఆదేశించారు. మంత్రుల మేడిగడ్డ బ్యారేజీ, కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనపై మీడియా కవరేజీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని, దీనిపై సమాచార పౌర సంబంధాల శాఖకు సమాచారం ఇవ్వాలని ఆయన చెప్పారు.