
‘వకీల్ సాబ్’ సినిమాతో తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్, ‘భీమ్లానాయక్’తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్నారు. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. యాక్షన్ సీన్స్ తీస్తున్నారు. ఇక హరీష్ శంకర్ డైరెక్షన్‌లో చేయాల్సిన ‘భవధీయుడు భగత్‌సింగ్’ త్వరలోనే సెట్స్‌కు వెళ్లనుంది. పవన్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నిర్మాత రామ్ తాళ్లూరి ఇప్పటికే ఓ సినిమాని అనౌన్స్ చేశారు. అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన ఈ రెండూ మొదలవకముందే వరుస సినిమాలు ఆయన ఖాతాలో చేరుతున్నాయి. సముద్రఖని డైరెక్ట్ చేయనున్న ‘వినోదాయ సిత్తం’ అనే తమిళ మూవీ రీమేక్‌లో సాయితేజ్‌తో కలిసి పవన్ నటించబోతున్నారనే టాక్ ఉంది. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘డ్రైవింగ్ లైసెన్స్’ తెలుగు రీమేక్ కూడా క్యూలో ఉంది. ‘విరాటపర్వం’ డైరెక్టర్ వేణు ఊడుగుల డైరెక్షన్‌లోనూ ఓ సినిమా ఉంటుందంటున్నారు. ఇక ‘ద కశ్మీర్ ఫైల్స్’తో నేషనల్ వైడ్ హిట్ అందుకున్న నిర్మాత అభిషేక్ అగర్వాల్.. పవన్‌తో ఓ ప్యాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇవి కాక స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్.. పవన్ కోసం ‘భజరంగీ భాయిజాన్’ తరహా క్రాస్ బోర్డర్ స్టోరీలైన్ ఒకటి రెడీ చేస్తున్నారట. వీటిలో పవన్ ఏయే సినిమాలు చేస్తారో, వాటిలో ఏది ముందుగా స్టార్ట్ చేస్తారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. మరి పవర్‌స్టార్ ఎలాంటి సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారో చూడాలి!