కేసీఆర్ ఫ్యామిలీలో ఆధిపత్య పోరు: ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్

కేసీఆర్  ఫ్యామిలీలో ఆధిపత్య పోరు: ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్

నర్సింహులపేట(మరిపెడ), వెలుగు: కేసీఆర్  ఫ్యామిలీలో ఆధిపత్య పోరు మొదలైందని ప్రభుత్వ విప్, డోర్నకల్  ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్  పేర్కొన్నారు. శుక్రవారం మహబూబాబాద్  జిల్లా మరిపెడలో మీడియాతో మాట్లాడారు. 20 ఏండ్లుగా రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ సెంటిమెంట్ తో విద్యార్థులను, ఉద్యోగ సంఘాల నాయకులను వాడుకున్నారని విమర్శించారు.

వారి ఆత్మ బలిదానాలతో సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే, తామే తెచ్చినట్లు బీఆర్ఎస్  నేతలు చెప్పుకున్నారన్నారు.పదేండ్ల పాలనలో ప్రభుత్వ ఆస్తులను అమ్మి రూ.10 లక్షల కోట్ల అప్పుల భారాన్ని రాష్ట్రంపై మోపారని తెలిపారు. దోచుకున్న సొమ్ము కోసమో, భవిష్యత్  రాజకీయ లబ్ధి కోసమో ముసలం మొదలైనట్లు రాష్ట్ర ప్రజలకు అర్థమవుతోందన్నారు.

హరీశ్​రావు ఇంట్లో కేటీఆర్ రెండున్నర గంటలు  సుదీర్ఘ చర్చలు జరపడంలో మతలబు ఏమిటో చెప్పాలన్నారు. గతంలో ఎన్నడూ హరీశ్ రావు ఇంటికి వెళ్లని కేసీఆర్  కుటుంబ సభ్యులు ఇప్పుడు వెళ్తున్నారని చెప్పారు. రెండోసారి మంత్రివర్గంలో చోటు ఇవ్వకుండా, ఎల్కతుర్తి సభకు ఆహ్వానించకుండా అవమానించారని గుర్తు చేశారు. కేసీఆర్  కుటుంబ సభ్యుల ఆధిపత్య పోరు, రాజకీయ స్వార్థాలు కేటీఆర్  చర్చలతో తేటతెల్లమైందని ఎద్దేవా చేశారు.