V6 News

విచారణకు ప్రభాకర్ రావు సహకరించట్లే : రాష్ట్ర ప్రభుత్వం

విచారణకు ప్రభాకర్ రావు సహకరించట్లే : రాష్ట్ర ప్రభుత్వం
  •     ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు
  •     డేటా డిలీట్ చేసి కేవలం డివైజ్​లు ఇచ్చారని వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కేసు దర్యాప్తుకు సహకరించడం లేదని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించింది. ప్రభాకర్ రావు సమర్పించిన డివైజ్ లలో డేటా లేదని, ఫార్మాట్ చేసిన తర్వాత వాటిని సమర్పించినట్లు నివేదించింది. 

ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ ఇస్తేనే స్వదేశానికి తిరిగి వస్తానని ప్రభకార్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, న్యాయస్థానం తిరస్కరించింది. హైకోర్టు తీర్పును ఈ ఏడాది మే 9న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించడంతో ఆయన దేశానికి వచ్చి సిట్ విచారణకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ కేసును బుధవారం మరోసారి జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ తో కూడిన బెంచ్ ​విచారించింది. 

ప్రభుత్వం తరఫు  అడ్వకేట్ సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపిస్తూ.. నిందితుడు ప్రభాకర్ రావు దర్యాప్తుకు సహకరించడం లేదని, 5 ఐఫోన్ పాస్​వర్డ్​లలో కేవలం రెండింటి రీసెట్ కు మాత్రమే సహకరించారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ రెండింటిలో ఎలాంటి డేటా లేదన్నారు. మరోవైపు.. ప్రభుత్వం గతంలో మోపిన అభియోగాలపై మంగళవారం అఫిడవిట్ దాఖలు చేసినట్లు ప్రభకార్ రావు తరఫు అడ్వకేట్ రంజిత్ కుమార్ కోర్టుకు తెలిపారు. 

దీనిపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు సిద్ధార్థ లూత్రా వారం సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. జస్టిస్ నాగరత్నం స్పందిస్తూ... అలా అయితే జనవరికి విచారణ వాయిదా వేస్తామని చెప్పారు. ఇప్పటికే విచారణ ఆలస్యం అవుతోన్న నేపథ్యంలో.. వెంటనే కౌంటర్ ఫైల్ చేస్తామని సిద్దార్థ్ లూత్రా కోర్టుకు తెలిపారు. ఈ అభ్యర్థను పరిగణనలోకి తీసుకొన్న బెంచ్​.. తదుపరి విచారణను నేటికి (గురువారానికి) వాయిదా వేసింది.