Dude Box Office : వంద కోట్ల క్లబ్‌లో 'డ్యూడ్'.. హ్యాట్రిక్ హీరోగా ప్రదీప్ రంగనాథన్‌!

Dude Box Office : వంద కోట్ల క్లబ్‌లో 'డ్యూడ్'.. హ్యాట్రిక్ హీరోగా ప్రదీప్ రంగనాథన్‌!

తమిళ యువ నటుడు ప్రదీప్ రంగనాథన్, అందాల నటి మమితా బైజు జంటగా నటించిన చిత్రం 'డ్యూడ్' (Dude) . విడుదలైన  తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 17న రిలీజైన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మిశ్రమ స్పందనలు అందుకున్నా... బలమైన 'మౌత్ టాక్'తో అనూహ్యంగా దూసుకెళ్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి, సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది.

వంద కోట్ల క్లబ్ లో 'డ్యూడ్'

 ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ (Mythri Movie Makers) ఈ బ్లాక్‌బస్టర్ విజయాన్ని ప్రకటించింది. 'డ్యూడ్' వంద కోట్ల పోస్టర్‌ను విడుదల చేస్తూ, "బ్లాక్‌బస్టర్ దీపావళి సీజన్" అని పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 'డ్యూడ్' విజయంతో హీరో ప్రదీప్ రంగనాథన్ అరుదైన ఘనత సాధించారు. వరుసగా తన మూడు సినిమాలను వంద కోట్ల క్లబ్‌లో చేర్చిన హ్యాట్రిక్ హీరోగా ఆయన చరిత్ర సృష్టించారు. 

హ్యాట్రిక్ హీరోగా..

ప్రదీప్ రంగనాథన్ తొలి చిత్రం లవ్ టుడే (Love Today). తన స్వీయ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రం రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసింది.  ఆయన రెండవ చిత్రం ఏకంగా డ్రాగన్ (Dragon) రూ. 150 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ అయింది. లేటెస్ట్ గా విడుదలైన ఈ మూడవ చిత్రండ్యూడ్ (Dude) ఆరు రోజుల్లోనే వంద కోట్ల మార్కును అధిగమించింది.

 

నిర్మాతలకు కాసుల పంట

కీర్తిశ్వరం అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. కానీ, విడుదలైన కొద్ది రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న 'డ్యూడ్', ఇప్పటికే భారీ లాభాలు తీసుకొచ్చి మైత్రీ సంస్థ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం తమిళంలో రూపొందించి, తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. మమితా బైజు (ప్రేమమ్ ఫేమ్) గ్లామర్, శరత్‌కుమార్ కీలక పాత్ర ప్రేక్షకాదరణ పొందాయి.

సందేశం, వినోదం మేళవింపు.. 

'డ్యూడ్' కేవలం కామెడీ, రొమాన్స్ మాత్రమే కాక, కులాంతర వివాహాలు, పరువు హత్యలు వంటి సున్నితమైన సామాజిక అంశాలతో పాటు యువతను ఆలోచింపజేసే బలమైన సందేశాన్ని ఇచ్చింది. ప్రదీప్ తనదైన కామెడీ టైమింగ్, స్టైలిష్ ఎలిమెంట్స్‌తో పాటు భావోద్వేగాలను పలికించడంలో చూపిన నైపుణ్యం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ జోరు చూస్తుంటే, 'డ్యూడ్' కలెక్షన్ల సునామీ ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు అంటున్నారు సినీ విశ్లేషకులు.