
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద.. క్యాండిడేట్స్ టోర్నీ–2026 బెర్త్‌పై గురి పెట్టాడు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి జరిగే గ్రాండ్ స్విస్ ఓపెన్ ఫైనల్ ఈవెంట్‌లో బలమైన ప్రత్యర్థులతో తలపడనున్నాడు. 11 రౌండ్ల పాటు జరగనున్న ఈ టోర్నీలో మెన్స్, విమెన్స్ సెక్షన్‌లో టాప్‌లో నిలిచిన ప్లేయర్లు క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధిస్తారు. ఈ ఏడాది క్వాలిఫయర్స్‌లో ప్రజ్ఞా మంచి పెర్ఫామెన్స్‌తో ఆధిక్యంలో ఉండటం అతనికి కలిసి రానుంది. ఎనిమిది ప్లేయర్లతో క్యాండిడేట్స్ టోర్నీ జరగనుంది. 2024, 2025 ఫిడే సర్క్యూట్‌లో రాణించిన ఒక ప్లేయర్‌కు ఇందులో స్థానం లభించింది. గ్రాండ్ స్విస్ నుంచి ఇద్దరు ప్లేయర్లు బరిలోకి దిగుతారు.
ఈ ఏడాది అక్టోబర్, నవంబర్‌లో గోవాలో జరగనున్న వరల్డ్ కప్ నుంచి ముగ్గురు ప్లేయర్లు, ఆరు నెలల అత్యధిక రేటింగ్ సగటు ఆధారంగా ఇద్దరు ప్లేయర్లు అర్హత సాధిస్తారు. 2004లో విశేషంగా రాణించిన ఫ్యాబియానో కరువానకు ఇప్పటికే బెర్త్ కన్ఫామ్ అయ్యింది. మిగతా ప్రత్యర్థులతో పోలిస్తే ప్రజ్ఞా మంచి ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్ బరిలో ఉన్నా.. ప్రజ్ఞానంద అవకాశాలకు పెద్దగా ఆటంకం కలిగించదు. అయితే వరల్డ్ చాంపియన్‌గా గుకేశ్.. గ్రాండ్ స్విస్‌లో ఆడుతుండటం అరుదైనదిగా భావించొచ్చు.
పెద్ద ఈవెంట్లలో తనను తాను నిరూపించుకోవాలనే తపనకు ఇది నిదర్శనం. 2025లో ప్రజ్ఞానంద అత్యుత్తమ పెర్ఫామెన్స్ చూపెట్టకపోతే తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఎరిగైసి అర్జున్ క్యాండిడేట్స్ బెర్త్‌కు దగ్గరగా ఉండేవాడు. అయితే ఈ ఈవెంట్‌కు తాను అర్హుడని నిరూపించుకోవడానికి అర్జున్ మరికొన్ని టోర్నీల్లో ఆడాల్సి ఉంది. 2023 గ్రాండ్ స్విస్ విజేతగా మునుపటి క్యాండిడేట్స్‌కుఅర్హత సాధించిన విదిత్ గుజరాతీ కూడా ఫామ్‌ను చూపెట్టాల్సి ఉంది. ఓపెన్ విభాగంలో పి. హరికృష్ణ, నిహాల్ సరీన్, ప్రణవ్ వెంకటేశ్ కూడా బరిలో ఉన్నారు. విమెన్స్ వరల్డ్ కప్ నెగ్గిన దివ్య దేశ్‌ముఖ్ ఓపెన్ కేటగిరీలో పోటీపడనుంది. ఇందుకోసం ఆమెకు వైల్డ్ కార్డు ఇచ్చారు. కోనేరు హంపి ఈ టోర్నీకి దూరంగా ఉంది. ఆర్. వైశాలి, వంతికా అగర్వాల్, ద్రోణవల్లి హారిక అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.