న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి బాధ్యతలు స్వీకరించారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో ప్రధాని మోడీ సలహా మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రహ్లాద్ జోషిని తాత్కాలిక విద్యా శాఖ మంత్రిగా నియమించారు. ఈ క్రమంలో విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి ఆదివారం (జులై 26) బాధ్యతలు స్వీకరించారు.
ప్రస్తుతం కేంద్ర వినియోగదారులు, ఆహార సరఫరా శాఖ మంత్రిగా ఉన్న జోషి.. ఆ శాఖలతో పాటు విద్యాశాఖ బాధ్యతలను కూడా నిర్వర్తించనున్నారు. మరోవైపు నూతన విద్యాశాఖ మంత్రి నియామకంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్ నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే నెక్ట్స్ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రేసులో ఉన్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రధాని మోడీకి ధన్యవాదాలు: జోషి
విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరణపై ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘ఈ రోజు నేను కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాను. నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు. ఈ బాధ్యతలను వినయంతో, ప్రగాఢమైన కర్తవ్య భావంతో స్వీకరిస్తున్నాను’’ అని జోషి పేర్కొన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా:
నీట్ పేపర్ లీకేజీ, విద్యా వ్యవస్థలోని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీలోని జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. సీజేపీ నిరసనకు మద్దతుగా ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ ఆమరణ నిరహార దీక్ష చేపట్టారు.
మరోవైపు.. ప్రధాన్ రాజీనామా చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు జులై 20న కాక్రోచ్ పార్టీ పార్లమెంట్ మార్చ్ (చలో సంసద్) కార్యక్రమం చేపట్టింది. ఈ చలో పార్లమెంట్ కార్యక్రమం తీవ్ర హింసాత్మకంగా మారింది. సీజేపీ నిరసనకారులపై పోలీసులు దమనకాండ కొనసాగించారు. విద్యార్థులపై విచక్షణరహితంగా లాఠీచార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్ ప్రయోగించారు. పోలీసుల దాడిలో పదుల సంఖ్యలో నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నిరసనకారులపై దాడికి నిరసనగా కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష పార్టీలు రంగంలోకి దిగాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నాలుగు రోజులుగా పార్లమెంట్ను స్తంభింపజేశాయి ప్రతిపక్షాలు. ఓ వైపు సీజేపీ.. మరోవైపు ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీంతో చేసేదేమి లేక సీజేపీ, ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.
