ధరణిపైనే ఎక్కువ ఫిర్యాదులు

ధరణిపైనే ఎక్కువ ఫిర్యాదులు

పంజగుట్ట, వెలుగు: ప్రజాభవన్ లో నిర్వహిస్తున్న ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువగా గత ప్రభుత్వంలో ధరణికి సంబంధించి జరిగిన అక్రమాల గురించే ఉంటున్నాయి. శుక్రవారం ప్రజావాణికి 1,364 దరఖాస్తులు రాగా ఇప్పటివరకు మొత్తం 47 వేలకుపైగా ఫిర్యాదులు వచ్చాయని అధికారులు వెల్లడించారు.  

 శంకర్​ హిల్స్​ ప్లాట్ల ఓనర్ల ఆందోళన

 గండిపేట మండలం వట్టినాగులపల్లిలో 1982లో 460 ఎకరాల్లో పంచాయతీ వెంచర్​ వేస్తే అందులో ప్లాట్లు కొన్నామని, ఇప్పుడు వెంచర్​ను వ్యవసాయ భూమిగా చూపి ధరణిలో ఎక్కించారని బాధితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తొలుత  వెంచర్​కోసం అమ్మిన వ్యక్తే మళ్లీ ఆ భూమిని మరొకరికి విక్రయించాడని, అతను  కుంటలుగా మార్చి అమ్ముకున్నాడని ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించి ప్లాట్లు ఇప్పించాలని బాధితులు రవికుమార్, మురళీధర్​గుప్తా, హరిబాబు, నూకల సుదర్శన్ ​తదితరులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

చెరువును కబ్జా చేశాడని మాజీ మంత్రి అనుచరుడిపై ఫిర్యాదు 

యాప్రాల్​లోని  సర్వే నంబర్​14, 32, 47లో నాగిరెడ్డి గొలుసు కట్టు చెరువును మాజీ మంత్రి మల్లారెడ్డి అండతో బీఆర్​ఎస్​ నాయకుడు డోకూరి మధుసూదన్​రెడ్డి కబ్జా చేశాడని, అందులో ఎటువంటి అనుమతులు లేకుండా ఫంక్షన్​హాల్ కట్టారని యాప్రాల్​జేఏసీ నాయకులు సాయికుమార్,​ రామిరెడ్డి, చంద్రశేఖర్, రవీందర్ తదితరులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదు చేశామని, అయినా చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.  

లాంగ్​డ్రైవ్​కార్స్ యజమాని ఇబ్బంది పెడుతున్నడు

మేడిపల్లిలోని లాంగ్​డ్రైవ్​ కార్స్​యజమాని కొప్పుల హరిదీప్​రెడ్డి తమను వైరుతో కొట్టాడని ఆ సంస్థ మాజీ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. తమ పేరెంట్స్​ను కిడ్నాప్​ చేస్తానని బెదిరిస్తున్నాడని పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని తెలిపారు. కంపెనీలో పని చేయాలంటే ఏడాది  అగ్రిమెంట్​ అడిగారని, ఇవ్వకపోయే సరికి వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మాకు పిలుపెందుకు రాలేదు?

మొత్తం15,400  కానిస్టేబుల్ ​పోస్టుల్లో 13,400 మందికి నియామక ఉత్తర్వులిచ్చారని, మిగతా రెండు వేల మందికి ఇవ్వలేదని కొందరు కానిస్టేబుల్​ అభ్యర్థులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మెడికల్​టెస్టు పూర్తయిందని, ఎస్బీ ఎంక్వైరీ కూడా అయిందని చెప్పారు. తమను ఎందుకు తీసుకోలేదో తెలియదని, వెంటనే నియామక ఉత్తర్వులివ్వాలని కోరారు.