
అమరావతిలో నిర్మించిన ప్రజా వేదిక అక్రమ నిర్మాణమని.. నిబంధనలకు విరుద్ధంగా దీనిని నిర్మించారని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అవినీతితో నిర్మించిన భవనంలో సమావేశం జరుపుకుంటున్నామనీ.. ఫ్లడ్ లెవెల్ కన్నా తక్కువలో ఈ భవనం ఉందని ఒక అధికారి లెటర్ ఇచ్చారని జగన్ చెప్పారు. రివర్ కన్జర్వేటివ్ రూల్స్ పట్టించుకోలేదనీ.. రూ.5 కోట్లను.. రూ.8.9 కోట్ల అంచనాగా పెంచారనీ.. ఇది చెప్పడానికే ఇక్కడ సమావేశం పెట్టాననీ జగన్ వివరించారు.
అక్రమ నిర్మాణంలో కూర్చొని నది పరిరక్షణ చట్టాలు ఎలా ఉల్లంఘించారో అందరికీ తెలియాలి.. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి అక్రమ నిర్మాణాలు కడితే.. కింద ఉన్న వాళ్ళు అక్రమాలు చేయకుండా ఉంటారా? దీనిని చూస్తేనే.. కిందిస్థాయిలో అవినీతి, అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అన్నారు. ఇలాంటి అక్రమ నిర్మాణం.. ఒక సామాన్య వ్యక్తి చేస్తే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.
“అక్రమ నిర్మాణమైన ప్రజావేదికను కూల్చేయాలి. రేపు ఎస్పీల మీటింగ్ పూర్తయ్యాక.. ఎల్లుండి.. అక్రమ కట్టడమైన ప్రజా వేదిక కూల్చివేస్తాం. ఇక్కడి నుంచే ప్రక్షాళన మొదలు పెడదాం. ఈ బిల్డింగ్ లో ఇదే చివరి సమావేశం” అన్నారు జగన్. ఎల్లుండి ప్రజావేదికను కూల్చివేయమని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్.