కేసీఆర్ అంబేద్కర్ మార్గంలో నడుస్తుండు: ప్రకాశ్ అంబేద్కర్

కేసీఆర్ అంబేద్కర్ మార్గంలో నడుస్తుండు: ప్రకాశ్ అంబేద్కర్

హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని చేయాలన్నారు అంబేద్కర్ మనవుడు ప్రకాశ్ అంబేద్కర్. ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఆయన అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. అంబేద్కర్ హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా చూడాలనుకున్నారని..భద్రతా కారణాల దృష్ట్యా దేశానికి రెండో రాజధాని అవసరమన్నారు.

అంబేద్కర్ విగ్రహావిష్కరణతో సీఎం  కేసీఆర్ కొత్త శకానికి నాంది పలికారన్నారు ప్రకాశ్ అంబేద్కర్. సమాజంలో మార్పుకోసం అంబేద్కర్  అహర్నిశలు తపించారని..  అంబేద్కర్ ఆశయాలను సాధించడమే ఆయనకు నిజమైన నివాళని తెలిపారు.  దేశ ప్రజలు సంతోషంగా ఉండాలని .. అందరూ విద్యావంతులు కావాలని  అంబేద్కర్ కోరుకున్నారని చెప్పారు. అంబేద్కర్ ఎన్నో సంఘర్షణలను ఎదుర్కొన్నారని ప్రకాశ్ అంబేద్కర్ అన్నారు.

దళితబంధు పథకం ఎంతో గొప్పదని.. నిమ్న వర్గాల  ఉన్నతి కోసమే అంబేద్కర్ తపించారని ప్రకాశ్ అంబేద్కర్ అన్నారు. కేసీఆర్ అలాంటి మార్గాన్నే ఎంచుకున్నారని..తెలంగాణను అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని కొనియాడారు.  మిగతా రాష్ట్రాల సీఎంలు కూడా కలిసి ముందుకు రావాలన్నారు.  వాజ్ పేయి తర్వాత దేశంలో జాతీయ నేతలు ఎవరూ లేరని.. ప్రాంతీయ పార్టీలకు జాతీయ నేతలుగా ఎదిగే అవకాశం వచ్చిందన్నారు. 

అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ప్రకాశ్ అంబేద్కర్ తెలిపారు. పొట్టిశ్రీరాములు ఆంధ్రప్రదేశ్ కోసం ప్రాణ త్యాగం చేశారని..  ఆయన ప్రాణ త్యాగం చేసే వరకు రాష్ట్రం ఇవ్వలేదన్నారు.  పొట్టి శ్రీరాములు బలిదానంతో అంబేద్కర్ చలించిపోయారని చెప్పారు. చిన్న రాష్ట్రాలతో ఉత్తమ  ఫలితాలు వస్తాయని  అంబేద్కర్ భావించారని..  అందుకే రాష్ట్రాల ఏర్పాటు కోసం స్పష్టమైన విధానం ఏర్పాటు చేశారని తెలిపారు. ఆర్థిక విధానంపై అంబేద్కర్ కు స్పష్టమైన విధానం ఉందన్నారు.