బీఆర్ఎస్​వి బోగస్ హామీలు: ప్రకాశ్ జవదేకర్

బీఆర్ఎస్​వి బోగస్ హామీలు:  ప్రకాశ్ జవదేకర్

న్యూఢిల్లీ, వెలుగు: ఎన్నికల మేనిఫెస్టో పేరుతో కేసీఆర్ మరోసారి బోగస్ హామీలు ప్రకటించారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్​చార్జ్ ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. కేసీఆర్ ఎన్ని తాయిలాలు ప్రకటించినా, తెలంగాణ ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరన్నారు. తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఓడిపోతుందని, కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమవుతుందని అన్నారు. ఆదివారం ఢిల్లీలోని తన ఇంట్లో జవదేకర్ మీడియాతో మాట్లాడారు.

 పదేండ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణను సర్వనాశనం చేశారని ఫైర్ అయ్యారు. ‘‘2014, 2018 ఎన్నికల టైమ్ లో ఇచ్చిన హామీలనే బీఆర్ఎస్ అమలు చేయలేదు. దళితులకు మూడెకరాల భూమి, గిరిజనులకు రెండెకరాల భూమి, కేజీ టు పీజీ విద్య, దళితబంధు, బీసీ బంధు, రుణమాఫీ.. ఇలా ఏ హామీలనూ అమలు చేయలేదు. దీంతో బీఆర్ఎస్ నేతలు గ్రామాల్లో తిరిగే పరిస్థితి కూడా లేదు. దళిత బంధులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని స్వయంగా కేసీఆరే ఒప్పుకున్నారు” అని చెప్పారు.