ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత.

ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత.

లక్ష 30 వేల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల

విజయవాడ: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజ్ కి వరద పోటెత్తుతోంది. దీంతో నిల్వ చేసే అవకాశం లేక బ్యారేజీ 70 గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి సుమారు లక్షా 30 వేల క్యూసెక్కులకు పైగా నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో స్థానిక వర్షాలకు వరద పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుండి వరద నీటిని విడుదల చేయకున్నా.. శ్రీశైలం ప్రాజెక్టుకు దిగువన కురిసిన వర్షాలకు మున్నేరు, వైరా, కట్లేరు, విప్లవాగు, కీసర తదితర వాగుల నుండి పెద్ద ఎత్తున వరద వస్తోంది. వస్తున్న వరద ప్రవాహాన్ని వస్తున్నట్లే దిగువన సముద్రంలోకి పంపిస్తున్నారు.

ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో 1లక్ష 45 వేల క్యూసెక్కులు ఉండగా.. బ్యారేజీకి దిగువన ఉభయ గోదావరి జిల్లాల కాలువలకు 10 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్న అధికారులు మిగిలిన 1లక్ష 30 వేల క్యూసెక్కులు సముద్రంలోకి పంపిస్తున్నారు. ఇవాళ ఉదయం నుండి ప్రకాశం బ్యారేజి ఎగువ భాగాన ఉన్న మున్నేరు, వైరా, కట్లేరు,విప్ల వాగు, కీసర వాగు పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద వరద ఉధృతి కూడా క్రమంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వస్తున్నారు.