ఎనిమిదేండ్లు ఎస్‌ఐబీలోనే ప్రణీత్‌రావు తిష్ట

ఎనిమిదేండ్లు ఎస్‌ఐబీలోనే ప్రణీత్‌రావు తిష్ట
  • రెండు స్పెషల్ రూమ్స్ కేటాయించుకుని అధికార దుర్వినియోగం
  • నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పినవే కాకుండా సొంతంగా రియల్టర్లు, వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్
  • ప్రభుత్వం మారడంతో హార్డ్​డిస్క్​లు, ఆధారాలు ధ్వంసం
  • పోలీసుల రిమాండ్​ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్​తోపాటు మరో మూడు రకాల నేరాలు చేసినట్లు పోలీసులు రిమాండ్​ రిపోర్టులో పేర్కొన్నారు. గత ప్రభుత్వ పెద్దలు చెప్పినవే కాకుండా రియల్టర్లు, బిజినెస్​మెన్లు, సంపన్నుల ఫోన్లు కూడా ప్రణీత్​ ఇల్లీగల్​గా ట్యాపింగ్ చేశాడు. ఎనిమిదేండ్లు ఎస్‌ఐబీలోనే తిష్ట వేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు.2016లో ఎస్‌ఐబీలో ఇన్‌స్పెక్టర్‌గా చేరిన ప్రణీత్‌రావు అప్పటి ప్రభుత్వ పెద్దలకు నమ్మినబంటుగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడ్డట్లు రిమాండ్​ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. 


ఎస్‌‌ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌‌ కుమార్‌‌ అలియాస్‌‌ ప్రణీత్‌‌రావుపై పంజాగుట్ట పోలీస్​స్టేషన్​లో నమ్మక ద్రోహం, అధికార దుర్వినియోగం, ఆధారాలను మాయం చేయడం, ధ్వంసం చేయడం నేరాలపై కేసులు నమోదు అయ్యాయి. ప్రణీత్‌‌రావు 2016లో ఎస్‌‌ఐబీ విభాగంలో ఇన్‌‌స్పెక్టర్‌‌గా చేరి అప్పటి నుంచి 2024 వరకు కొనసాగారు. 2023లో అగ్జిలరేటరీ పద్ధతిలో డీఎస్‌‌పీగా పదోన్నతి పొందేంత వరకు ఎస్‌‌ఐబీలోనే తిష్టవేసినట్లు గుర్తించారు. ఎస్‌‌ఐబీ పెద్దలకు, గత ప్రభుత్వ పెద్దలకు నమ్మిన బంటుగా ఉంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలుస్తున్నది. ఎస్‌‌ఐబీలో రెండు గదులను ప్రత్యేకంగా కేటాయించుకొని లీజ్‌‌లైన్‌‌ల ద్వారా వాటిలో 17 కంప్యూటర్‌‌లను ఏర్పాటు చేసుకున్నాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫోన్‌‌ ట్యాపింగ్‌‌, నిఘా వంటి కార్యకలాపాలు నిర్వహించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి అధికారులకు అందజేసేవాడు. దీంతోపాటు రియల్టర్లు, సంపన్నులు, బిజినెస్​మెన్ల ఫోన్లు కూడా ఇల్లీగల్​గా ట్యాపింగ్ చేసేవాడు.

సొంత హార్డ్ డిస్క్ ల్లోకి సమాచారం

ట్యాపింగ్​చేసిన డేటాను ప్రణీత్​రావు ఎప్పటికప్పుడు తన సొంత హార్డ్‌‌ డిస్కుల్లోకి కాపీ చేసుకునే వాడు. గతేడాది డిసెంబర్‌‌–3న ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత గత ప్రభుత్వం ఓడిపోవడంతో 2023 డిసెంబర్‌‌ 4న ప్రణీత్‌‌ కుమార్‌‌ సీసీటీవీ కెమెరాలను ఆపివేసి, ఏండ్ల తరబడి హార్డ్‌‌ డ్రైవ్స్‌‌లో సేవ్​చేసిన డాటాను ధ్వంసం చేసి, వాటి స్థానంలో కొత్త హార్డ్‌‌ డ్రైవ్‌‌లను ఏర్పాటు చేసినట్లు పోలీసులు రిమాండ్‌‌ రిపోర్టులో వెల్లడించారు. పోలీసులు ప్రణీత్‌‌ కుమార్‌‌పై 409, 427, 201, 34 ఐపీసీ సెక్షన్‌‌ 3లతోపాటు 65, 66, 70 ఐటీ యాక్ట్‌‌లు ప్రయోగించి కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో సిరిసిల్ల జిల్లా డీసీఆర్‌‌బీ వర్టికల్‌‌ విభాగానికి బదిలీ అయిన అతన్ని జూబ్లీహిల్స్‌‌ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో పంజాగుట్ట ఇన్‌‌స్పెక్టర్‌‌ బి.శోభన్‌‌, ఎస్‌‌ఐ పి.ప్రదీప్‌‌ టీమ్ మార్చి–12 రాత్రి 10:30కు అరెస్టు చేశారు. మరుసటి రోజు తెల్లవారుజామున 2:15కు హైదరాబాద్‌‌కు తరలించారు. అరెస్ట్‌‌ చేసిన సమాచారాన్ని ఆయన ప్రణీత్ బావ జె.అనుదీప్‌‌కు తెలియజేసినట్లు రిమాండ్‌‌ రిపోర్టులో తెలిపారు. ప్రణీత్‌‌ రావు నుంచి పోలీసులు ఒక లాప్‌‌టాప్‌‌, మూడు మొబైల్‌‌ ఫోన్‌‌లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అప్పటికే సేకరించి పెట్టుకున్న సమాచారంతో ప్రశ్నించగా.. ప్రణీత్‌‌ నేరాన్ని అంగీకరించాడు.