Hanuman Movie Review: వెండితెరపై హనుమంతుని విశ్వరూపం

Hanuman Movie Review:  వెండితెరపై హనుమంతుని విశ్వరూపం

చిన్న సినిమా అంటూనే.. పాన్ ఇండియా సినిమాగా వచ్చేసింది హనుమాన్. ప్రశాంత్ వర్మ్ (Prasanth Varma)  డైరెక్షన్, తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన హనుమాన్...కు కోట్లు ఖర్చుపెట్టినా రానంత పబ్లిసిటీ వచ్చింది. చిన్న సినిమాకు.. థియేటర్లు దొరకడం లేదంటూ.. భీభత్సంగా సినిమాకు బజ్ క్రియేట్ అయ్యింది. నార్త్ మార్కట్ ను నమ్ముకుని.. సంక్రాంతి బరిలోకి దిగిన హనుమన్.. ఎలా ఉంది? హనుమంతుడి పవర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయా? లేదో..రివ్యూలో తెలుసుకుందాం.

ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ రెండున్నరేళ్ళ కృషి హనుమాన్ సినిమా. హనుమంతుడి పవర్స్, సైన్స్ కలబోతగా..హనుమాన్ తెరకెక్కింది. చిన్న సినిమాగా ప్రారంభమైన హనుమాన్... పాన్ వరల్డ్ సినిమాగా దూసుకుపోయింది. దీనికి తోడు.. సంక్రాంతి బరిలోకి దిగడంతో.. పెద్ద హీరోల ముందు హనుమాన్ కనిపించలేదు. చిన్న సినిమాపై వివక్ష అంటూ.. సినిమాపై సోషల్ మీడియా వేదికగా రచ్చ షురూ అయ్యి, హనుమాన్ కు ఫుల్ పబ్లిసిటీ వచ్చేసింది. ఏదేమైనా.. థియేటర్స్ తక్కువగా ఉన్నా కూడా.. నార్త్ మార్కెట్ ను నమ్ముకున్న హనుమాన్ మేకర్స్.. సంక్రాంతికే రిలీజ్ చేసారు. 

కథేంటంటే:

అంజనాద్రి అనే ఊరులో.. హనుమంతు పాత్రలో తేజ సజ్జ(Teja Sajja) అక్కతో(Varalaxmi Sarathkumar) కలసి ఉంటాడు. అక్క నోటికి భయపడి ఎవరూ పెళ్లి చేస్కోవడానికి ముందుకు రాకపోవడంతో.. సూర్యాకాంతంలాంటి వాళ్లను ఎవరూ పెళ్లి చేస్కోరు అంటూ అక్క వరలక్ష్మీ శరత్ కుమార్ ను తిడుతూ ఉంటాడు. మరోవైపు ఊరిలో చిన్న చిన్న దొంగతనాలు చేస్తుండడంతో.. ఊరిలో దొంగ హనుమంతు అంటూ పిలుస్తారు. ఇవేమీ పట్టించుకోని.. తేజ సజ్జ చిన్నప్పటి నుంచీ ఇష్టపడే హీరోయిన్ అమృత అయ్యర్ ను ప్రేమిస్తుంటాడు. ఊరిలో కుస్తీ పోటీలు, పాత పద్దతిలో పన్నుల వసూళ్ల కోసం ఊరి జనాన్ని ఇబ్బంది పెట్టే నాయకుడిని అమృత అయ్యర్ ఎదిరిస్తుంది. తమ ఆకృత్యాలకు అడ్డు పడుతుందని.. అమృత అయ్యర్ ను చంపాలని ప్లాన్ చేయడం, అమృత అయ్యర్ ను కాపాడబోయి నదిలో పడిపోయిన తేజ సజ్జకు ఒక మణి దొరకుతుంది. మని అనుకోకుండా దొరుకుతుందా? లేక ఏదైనా కార్యం కోసం దేవుడే ఆ మణి ని తేజకు ఇస్తాడా? మణి తో తేజకు ఎలాంటి పవర్స్ వస్తాయి? ఆ పవర్స్ తో తేజ ఏం చేస్తాడు? సూపర్ పవర్స్ కోసం తన కుటుంబాన్నే పణంగా పెట్టిన వినయ్ రాయ్.. తేజ పవర్స్ కోసం ఎలాంటి పధకం వేస్తాడు? హనుమాన్ పార్ట్ వన్ కు ఎలాంటి లింక్ తో ఎండ్ కార్డ్ పడిందో తెలియాలంటే.. హనుమాన్ చూడాల్సిందే.. 

ఎవరెలా చేశారంటే:

హనుమంతు పాత్రలో తేజ సజ్జ జీవించాడు. పనిపాట లేకుండా జులాయిగా తిరిగి, సూపర్ పవర్స్ వచ్చిన తరువాత మరో షేడ్ లో ఆకట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్ లో తేజ సజ్జ అమాయకత్వంతో... గెటప్ శ్రీను, సత్యలతో చేసే కామెడీ హిలేరియస్ గా ఉంది. సూపర్ పవర్స్ వచ్చిన తరువాత చేసే కామెడీ చిన్న పిల్లలు  బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్.. అక్క పాత్రలో సెంటిమెంట్ ను పండించింది. హీరోయిన్ అమృత అయ్యర్ అందంతో పాటు నటనతో ఆకట్టుకుంది. ఇక ఎప్పటిలాగే గెటప్ శ్రీను, సత్య సినిమాలో నవ్వులు పూయించారు. ఇక విలన్ పాత్రలో సూపర్ పవర్స్ కోసం వేటాడే విలన్ రాయ్.. పాత్రకు కరెక్ట్ గాసెట్ అయ్యాడు. సాదు పాత్రలో సముద్ర ఖని.. నటన, డైలాగ్స్ బాగా పండాయి. 

టెక్నీషియన్స్:

అంజనాద్రి ఊరిలో జరిగే స్టోరీనీ ముందుకు తీస్కువెళ్లడంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ్ సక్సెస్ అయ్యాడు. ఒక సాధారణ వ్యక్తికి ఊరి బాగు కోసం సూపర్ పవర్స్ వస్తే.. ఎలా ఉంటుందో చక్కగా చూపించాడు. హనుమంతుడి పాత్రను చూపించకుండానే..అతని పవర్స్ ను చూపించాడు. క్లైమ్యాక్స్ లో 20 నిమిషాలు..పూనకాలు తెప్పిస్తాయి విజువల్ ఎఫెక్ట్స్. దానికి తగ్గ నేపధ్య సంగీతంతో..క్లైమ్యాక్స్ ఆకట్టుకుంటుంది. సినిమా ఎండ్లో.. హనుమంతుడి కళ్లు తెరవడంతో..పార్ట్ 2కు ఎంట్రీ కార్డ్ పడుతుంది. దాసరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ, సాయిబాబ తలారి ఎడిటింగ్, నిరంజన్ రెడ్డి నిర్మాణ విలువలు సినిమాకు ఏమాత్రం తగ్గలేదు. 

చివరగా : 

సూపర్ పవర్స్ కు కామెడీ తోడవ్వడంతో.. పిల్లలు, ఫ్యామిలీస్ సినిమాకు కనెక్ట్ అవుతారు. ఇక శ్రీరాముడు, హనుమాన్ భక్తులకు.. సినిమా నచ్చుతుందనడంలో సందేహం లేదు.  దీనికి తోడు  జనవరి 22న అయోధలో ప్రాణప్రతిష్ట జరగానికి ముందు సినిమా రిలీజ్ అవ్వడంతో.. సినిమాకు మరో ప్లస్ పాయింట్ యాడ్ అయ్యింది. ఇక నార్త్ మార్కెట్ లో హనుమాన్ కు కలెక్షన్స్ వస్తే.. బాక్సాఫీసులను షేక్ చేస్తోందనడంలో సందేహం లేదు.