కాంగ్రెస్ లో చేరాలని పీకేను కోరిన హైకమాండ్

కాంగ్రెస్ లో చేరాలని పీకేను కోరిన హైకమాండ్

న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్  (పీకే) కాంగ్రెస్​లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆయనను పార్టీలో చేరాలని హైకమాండ్ అడిగినట్లు సమాచారం. శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఇంట్లో పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. దీనికి ప్రశాంత్ కిశోర్ హాజరయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన ప్రజంటేషన్ ఇచ్చారు. ‘‘ప్రశాంత్ కిశోర్​ను ఎన్నికల వ్యూహకర్తగా కాకుండా, పార్టీలో చేరి లీడర్ గా పని చేయాలని హైకమాండ్ కోరింది. త్వరలోనే ఆయన కాంగ్రెస్​లో చేరొచ్చు” అని కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. కాగా, ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీలో చేయాల్సిన మార్పులపై పీకే ప్రజంటేషన్ ఇచ్చారు. ఇప్పటికే పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాలపై మరింత ఫోకస్ పెట్టాలని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 370 సీట్లు లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన సూచించారు. ‘‘వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రశాంత్ కిశోర్ ప్రజంటేషన్ ఇచ్చారు. వాటిపై చర్చించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించాం. ఆ కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారనేది సోనియా గాంధీ నిర్ణయిస్తారు” అని పార్టీ సీనియర్ లీడర్ కేసీ వేణుగోపాల్ చెప్పారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖార్గే, అంబికా సోనీ, దిగ్విజయ్ సింగ్, అజయ్ మాకేన్ పాల్గొన్నారు.