Bigg Boss Season 9: బిగ్ బాస్‌ హౌస్‌లో నాగార్జున డైరెక్టర్.. మరింత రసవత్తరంగా మారిన షో!

Bigg Boss Season 9: బిగ్ బాస్‌ హౌస్‌లో నాగార్జున డైరెక్టర్.. మరింత రసవత్తరంగా మారిన షో!

ఇండియన్ బుల్లి తెర రియాలిటీ షో క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతోంది. సాయంత్రం అయితే చాలు షో టైమ్ కి ఇంటిల్లిపాది టీవీల ముందు వాలిపోతున్నారు. ఈ షోలో గ్లామర్, గొడవలు, గేమ్‌ప్లాన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. లేటెస్ట్ గా బిగ్ బాస్ తమిళం సీజన్ 9 ఆక్టోబర్ 5న అత్యంత అట్టహాసంగా ప్రారంభమైంది. దీనికి తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సారి మరింత రసవత్తరంగా షో మొదలైంది.  సినీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, వ్యాపారవేత్తలు, కళాకారులతో సహా 20 మంది కంటెస్టెంట్‌లు ఈసారి బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు.

అక్కినేని' రక్షకుడు' మేకర్ ఎంట్రీ... 

అయితే  కంటెస్టెంట్లలో ఒకరు మాత్రం ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయనే... తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు-దర్శకుడు ప్రవీణ్ గాంధీ. బిగ్ బాస్ ఇంట్లో ఆయన సరళమైన, నిజాయితీతో కూడిన వ్యక్తిత్వాన్ని ఇప్పుడు ప్రేక్షకులు చూస్తున్నారు. కానీ ఒకప్పుడు ఆయన సినీ పరిశ్రమకు అందించిన అద్భుతమైన ప్రాజెక్టుల గురించి చాలా మందికి తెలియదు. ప్రవీణ్ గాంధీ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం 'రక్షకుడు' (Ratchagan) కు దర్శకత్వం వహించారు. ఈ సినిమా 1997లో విడుదలైంది. ఇందులో కింగ్ నాగార్జున అక్కినేని, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ జంటగా నటించారు. ఆ కాలంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, అద్భుతమైన విజువల్స్‌తో తెరకెక్కిన ఈ యాక్షన్-రొమాంటిక్ చిత్రం అప్పట్లో ఒక సంచలనంగా నిలిచింది. ముఖ్యంగా, ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ అందించిన సంగీతం, పాటలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి.

చివరి చిత్రంతో.. 

ప్రవీణ్ గాంధీ సినీ ప్రయాణం 'రక్షకుడు'తోనే ఆగిపోలేదు. దర్శకుడిగా ఆయన తదుపరి చిత్రం 'జోడి' (Jodi - 1999). ఈ రొమాంటిక్ డ్రామా యువ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన 'స్టార్' (Star - 2001) కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే, దర్శకుడిగా ఆయన చివరి చిత్రం 2014లో వచ్చిన 'పులిపార్వై' (Pulipaarvai). ఈ చారిత్రక డ్రామాను ఆయన స్వయంగా నిర్మించి, నటించడం విశేషం. అంతేకాకుండా, ఆయన నటుడిగా, రచయితగా కూడా పలు తమిళ చిత్రాలలో తనదైన ముద్ర వేశారు.

కెమెరా వెనుక నుంచి కెమెరా ముందుకి..

సుమారు రెండు దశాబ్దాలుగా సినీ ప్రపంచంలో చురుకుగా ఉన్న ప్రవీణ్ గాంధీ, ఇప్పుడు బిగ్ బాస్ తమిళం 9 తో ఒక సరికొత్త సవాలును స్వీకరించారు.  సినిమా సెట్‌లో, టేక్ చెప్పినా, కట్ చెప్పినా అందరూ వినాల్సిందే. కానీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో ఆ అధికారం లేదు. ఇక్కడ ప్రతి క్షణం ఒక కొత్త సవాలే. ఇది కేవలం భావోద్వేగాలు, అనుకూలత, వ్యూహాన్ని పరీక్షించే గేమ్. సెట్ మొత్తాన్ని తన అదుపులో ఉంచుకునే దర్శకుడు, ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లో తనలోని నిశ్చలత, సృజనాత్మకత,  జీవితానుభవాన్ని ఎలా ఉపయోగిస్తారో చూడాలని అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

సినీ పరిశ్రమలో  ఆయనకు ఉన్న సుదీర్గ అనుభవం, వయస్సు, ప్రశాంతమైన వ్యక్తిత్వం వల్ల హౌస్‌లో ఆయన ఒక సలహాదారు పాత్ర పోషించే అవకాశం ఉంది. మరి సినిమా సెట్‌లో కథనాన్ని నడిపించిన ఈ దర్శకుడు, బిగ్ బాస్ హౌస్ గేమ్‌ను ఎలా నడిపిస్తారు?  యువ కంటెస్టెంట్ల మధ్య తన ఉనికిని ఎలా చాటుకుంటారు? ఈ సీజన్‌లో ఆయన అత్యంత ఆసక్తికరమైన కంటెస్టెంట్‌లలో ఒకరిగా నిలబడతారా? అనేది తెలియాలంటే కొన్ని వారాలు వేచి చూడక తప్పదు..