
ఆశయం ముందు అంధత్వం చిన్నబోయింది. కంటి చూపు లేకున్నా అతడి ఆశయమే దారి చూపిస్తోంది. అతని ఆశయం విజయం వైపు అడుగులు వేస్తోంది. తనలోని లోపం ముందు తన టాలెంట్ తలదించుకుంది. 14 ఏళ్ల వయస్సులో చూపుకోల్పోయిన అతడు ముందు తన జీవితం ముగిసిపోయిందనుకున్నాడు. కొద్ది రోజులు తనలో తానే ఏడుస్తూ కృశించిపోయాడు. కంటి చూపు లేకపోయినా జీవితంలో గెలవాలన్న అతని పట్టుదల గమ్యం వైపు అడుగులు వేయించింది. జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటూ తన జీవితాన్ని కొత్తగా మలుచుకున్నాడు. అంధత్వాన్ని లెక్కచేయకుండా జిమ్నాస్టిక్స్ లో రాణిస్తూ.. అందరితో శభాష్ అనిపించుకుంటున్న ప్రవీణ్ పై V6 డిజిటల్ ప్రత్యేక కథనం..
ప్రవీణ్ బాల్యం కూడా అందరు పిల్లల్లానే సంతోషంగా సాగింది. 13 ఏళ్ల వరకు ఆడుతూ పాడుతూ గడిపాడు. 14వ ఏట ప్రవీణ్‌కు అనుకోని కష్టం వచ్చిపడింది. రెటీనా సమస్యతో అతడు కంటి చూపు కోల్పోయాడు. దీంతో అతని జీవితంలో ఒక్కసారిగా అంధకారం అలుముకుంది. తాను కన్న కలలు ఇక ఎన్నటికీ నిజం కావని కుమిలిపోయాడు. కంటి చూపు కోల్పోయిన బాధలో కొన్నేండ్లు ఇంటికే పరిమితమయ్యాడు. ఆ తర్వాత తన లోపం తన ఆశయానికి అడ్డుకావొద్దని నిర్ణయించుకుని జిమ్నాస్టిక్స్ కోచింగ్ లో చేరాడు.
ప్రవీణ్ ఒకవైపు డిగ్రీ చదువుతూనే.. మరోవైపు జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. ఎల్బీ స్టేడియంలో కోచ్ ఫైజల్ దగ్గర 3 నెలలు బేసిక్స్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత కరోనాతో గ్యాప్ రావడంతో కొద్ది రోజులు కోచింగ్ ఆపేశాడు. ఆ తర్వాత జిమ్నాస్టిక్స్ నేర్చుకునేందుకు ఆసక్తి చూపినా కొందరు కోచ్ లు తన లోపాన్ని ఎత్తి చూపారు. కోచింగ్ ఇవ్వనని ముఖం మీదే చెప్పారు. ఈ సమయంలో నిరుత్సాహ పడకుండా రెట్టించిన పట్టుదలతో ఉప్పల్‌లోని లైవ్ ఇట్ ఫిట్నెస్ స్టూడియోలో కోచింగ్ లో జాయిన్ అయ్యాడు. కోచ్ షేక్ తహెర్ దగ్గర 6 నెలల నుంచి జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటున్నాడు.
జిమ్నాస్టిక్స్ మీద వున్న ఇంట్రెస్ట్‌తో ప్రవీణ్ త్వరగా నేర్చుకుంటున్నాడని కోచ్ షేక్ తహెర్ చెబుతున్నారు. మొదట్లో ప్రవీణ్‌కి నేర్పించడం కష్టంగా ఉండేదని తర్వాత తనకున్న ఇష్టంతో ఈజీగా నేర్చుకున్నాడని అంటున్నాడు. నార్మల్ పర్సన్‌తో పోలిస్తే ప్రవీణ్‌కి కోచింగ్ ఇవ్వడం.. అర్ధం అయ్యేలా చెప్పడం కాస్త ఎక్కువగా సమయం పట్టిందన్నారు. కోచింగ్ కోసమే ఎవరి సహాయం లేకుండా మెహదీపట్నం నుంచి ఉప్పల్‌లో ఉన్న స్టూడియోకి బస్ జర్నీ చేసి వస్తున్నాడని.. తన ప్రతిభ చూసి ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నామని కోచ్ చెప్పారు. ప్రవీణ్ కి నేర్పించడం ఒక ఛాలెంజ్ గా తీసుకున్నానని కోచ్ షేక్ తహెర్ తెలిపారు.