- ఆక్వాకల్చర్ పై ఆఫీసర్ల దృష్టి
- రాష్ట్ర వ్యాప్తంగా 20 ప్రాజెక్టుల ఎంపిక
- ఎస్సారెస్పీ, కడెం, సుద్దవాగు ప్రాజెక్టుల్లో ముమ్మర ఏర్పాట్లు
నిర్మల్, వెలుగు: ఆక్వాకల్చర్ ద్వారా రొయ్యల పెంపకానికి మత్స్యశాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20 ప్రాజెక్టుల్లో రొయ్యలు పెంచాలని ఆ శాఖ నిర్ణయించింది. తద్వారా మత్స్యకారులకు ఉపాధి దొరకడంతో పాటు లాభాలు కూడా వస్తాయని భావిస్తోంది. ఇప్పటికే రొయ్యల పెంపకంపై మత్స్యకారులకు ఆఫీసర్లు ట్రైనింగ్ ఇచ్చారు. నిర్మల్ జిల్లాలో మూడు ప్రాజెక్టుల్లో ఆక్వాకల్చర్ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎస్సారెస్పీ, కడెం, సుద్దవాగు ప్రాజెక్టుల్లో పనులు ఊపందుకున్నాయి.
మూడింటిలో 10లక్షల రొయ్యలు..
ఎస్సారెస్పీతో పాటు కడెం, సుద్దవాగు ప్రాజెక్టుల్లో దాదాపు 90లక్షల రొయ్యలు పెంచాలని ఆఫీసర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 62 లక్షలు, కడెంలో 9లక్షలు, సుద్దవాగులో10 లక్షల రొయ్య పిల్లల్ని వదిలారు. రొయ్యల పెంపకం కోసం జిల్లావ్యాప్తంగా 2500 మంది మత్స్యకారులకు శిక్షణ ఇచ్చి, ప్రత్యేకంగా లైసెన్సులు జారీ చేశారు. రొయ్యలకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉండడంతో వీటి పెంపకంపై ఆఫీసర్లు ఫోకస్ పెట్టారు.
గోదావరి రొయ్యకు మంచి రేటు..
గోదావరి రొయ్యకు మార్కెట్లో మంచి రేటు పలుకుతోందని ఆఫీసర్లు చెబుతున్నారు. అందుకే గోదావరిపై ఉన్న శ్రీరాంసాగర్, కడెం, సుద్దవాగు ప్రాజెక్టుల్లో రొయ్యలు పెంచుతున్నట్లు వెల్లడించారు. గోదావరి నీటిలో ఉన్న పోషకాలు రొయ్యల ఎదుగుదలకు ఉపయోగపడుతాయని చెప్తున్నారు. ఈ మూడు ప్రాజెక్టుల్లో ప్రస్తుతం నీలకంఠ రొయ్య(రోజర్ బర్గీ)లను పెంచుతున్నారు. ఇవి తినడానికి రుచిగా ఉంటాయని పేర్కొన్నారు. కాగా, రొయ్యలు స్టోర్ చేయడానికి ప్రస్తుతానికి ఐస్ బాక్సులనే వినియోగిస్తున్నా.. ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు ప్రత్యేక బాక్సులు తెప్పించాలని మత్స్యకారులు కోరుతున్నారు.
మత్స్యకారులకు ఉపాధి..
ఇతర రకాల చేపలతో పాటు రొయ్యల పెంపకం ద్వారా మత్స్యకారులకు ఉపాధి పెరగనుంది. మార్కెట్లో చేపల ధరలు అంతంత మాత్రంగానే ఉండడంతో శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. రొయ్యల వల్ల లాభాలతో పాటు దిగుబడి కూడా అధికంగా వస్తుందని ఆఫీసర్లు చెప్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో నిర్మల్ జిల్లాలో కేజ్ కల్చర్ ద్వారా చేపలు పెంచారు. కొన్ని నెలలు ఇది విజయవంతంగానే సాగినా.. భారీ వరదల వల్ల కేజ్‌లు కొట్టుకుపోయాయి. దీంతో మత్స్యకారులకు నష్టాలు మిగిలాయి. రొయ్యల పెంపకం ద్వారానైనా లాభాలు వస్తాయా? అనే అనుమానం మత్స్యకారుల్లో కలుగుతోంది.
